Wayanad Bypoll: పార్లమెంటు ఎంపీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ నియాజకవర్గం సీటుకు ఖాళీ ఏర్పడింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారా? అనే అంశం చర్చకు వచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వయనాడ్ ఉపఎన్నికపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాహుల్‌కు కోర్టు 30 రోజుల సమయం ఇచ్చిందని.. కోర్టు తీర్పు తర్వాత ఉపఎన్నికపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఏడాదికి పైగా సమయం ఉన్నందున ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది.
రాహుల్‌పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన వయనాడ్ లోక్‌సభ సీటుకు ప్రజాప్రాతినిధ్యం చట్టం-2015లోని సెక్షన్ 151ఏ కింద ఆరు నెలల్లోపు ఉపఎన్నిక జరపాల్సి ఉంటుంది. దోషిగా నిరూపణపై కనీసం రెండేళ్ల పాటు శిక్ష పడిన ఎంపీ ఎవరైనా సరే అనర్హత వేటుకు అర్హుడని సెక్షన్ 8(3) చెబుతోంది. ఇదే సెక్షన్ కింద రాహుల్‌పై లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం నాడు అనర్హత వేటు వేసింది. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ హైకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 కింద లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. సూరత్ కోర్టు తన తీర్పును పైకోర్టులో సవాలు చేసుకునేందుకు రాహుల్‌కు 30 రోజుల సమయం ఇచ్చింది. రాహుల్ అభ్యర్థనపై వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ కూడా మంజురు చేసింది.
Read Also: Karnataka Election Schedule: కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..
రాహుల్ గాంధీ 2019లో అమేథీతో పాటు వయనాడ్‌కు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అమేథీలో ఆయన ఓటమి చవిచూశారు. వయనాడ్‌లో గెలుపొందారు. ప్రస్తుతం పరువునష్టం కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడటంతో సూరత్ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టులో రాహుల్ సవాలు చేయనున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పైకోర్టు స్టే ఇవ్వకుంటే 8 ఏళ్ల పాటు పోటీ చేసే ఛాన్స్‌ను రాహుల్ గాంధీ కోల్పోతారు.