జనగామ జిల్లాలో కుల బహిష్కరణ కలకలం రేపింది. జనగామ మండలం ఓబుల్ కేశవపురం గ్రామంలో తమ కులాన్ని బహిష్కరించారంటూ కుమ్మరి కులస్థుల ఆవేదన వ్యక్తం చేసింది. దళితులకు సహాయం చేశారనే కోపంతో కుమ్మరి కులస్థులను ఓసీ కులస్థులు గ్రామం నుంచి బహిష్కరించారు. ఈ వ్యవహారంపై కుమ్మరి కులస్థులు డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని అన్ని కులాలు కలిసి తమపై కక్షపూరిత ధోరణిలో వ్యవహారిస్తున్నారని పేర్కొన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్‌కు ఫిర్యాదు అందగా.. విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.
Also Read: Arundhati Reddy: మా అమ్మకి మీరు హీరో సర్.. ప్రధానితో తెలుగు మహిళా క్రికెటర్ సంభాషణ!
ఓబుల్ కేశవపురం గ్రామంలో కుల వృత్తిని మానేయాలని దళితులు నిర్ణయించుకున్నారు. తమకు ఉపయోగ పడే కులాల వారికి తప్ప ఎవరు చనిపోయినా డప్పు కొట్టమని దళితులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో తమ గ్రామంలోని దళితులకు ఏ కుల వృత్తుల వారు సహాయం చేయకూడదని ఓసీ కుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇటీవలే గ్రామంలో దళితుల పెళ్లిళ్లకు కుమ్మరి కులస్థులు కుండలు ఇచ్చారు. దళితులకు సహాయం చేశారనే కోపంతో కుమ్మరి వారిని ఓసీ కులస్థులు బహిష్కరించారు. గ్రామంలోని ఏ కులం వారు కూడా కుమ్మరి వారి వద్ద కుండలు తీసుకోకూడదని కట్టుబాటు చేశారు. ఏ కార్యక్రమం ఉన్నా జనగామ నుంచి కుండలు తెచ్చుకోవాలే తప్ప.. గ్రామంలో కుమ్మరి వారి వద్ద తీసుకోకూడదని చెప్పారు. ఎవరైనా కాదని తీసుకుంటే వారి కులాన్ని కూడా బహిష్కరిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ పంచాయితీ డీసీపీ కార్యాలయంకు చేరింది. మరి ఈ సున్నితమైన విషయాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.
