Wimbledon 2024 Winner Carlos Alcaraz Interview: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్, యువ సంచలనం కార్లోస్ అల్కరాస్ నిలబెట్టుకున్నాడు. లండన్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ అల్కరాస్ 6-2, 6-2, 7-6 (7-4) తేడాతో రెండో సీడ్, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్‌ను ఓడించాడు. 2 గంటల 27 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో అల్కరాస్ ముందు జకోవిచ్ నిలబడలేకపోయాడు. తొలి రెండు సెట్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అల్కరాస్‌కు మూడో సెట్లో ప్రతిఘటన ఎదురైంది. అయినా బలంగా నిలబడి విజయంతో మ్యాచ్ ముగించాడు.
మ్యాచ్ అనంతరం కార్లోస్ అల్కరాస్ మాట్లాడుతూ.. వింబుల్డన్ దక్కించుకోవడం తన కల అని 11 ఏళ్ల వయసులోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పానని తెలిపాడు. ‘వింబుల్డన్ ట్రోఫీ మళ్లీ గెలవడం ఓ కలలా ఉంది. వింబుల్డన్ ట్రోఫీ దక్కించుకోవడం నా కల అని 11 ఏళ్ల వయసులో ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. ఇప్పుడు వరుసగా రెండు సార్లు గెలిచాను. చాలా సంతోషంగా ఉంది. ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచిన ఆటగాడిగా అగ్రశ్రేణి ఆటగాళ్ల సరసన చేరడం గొప్పగా ఉంది. ఇక యూరో కప్ 2024లో స్పెయిన్ ఫైనల్ మ్యాచ్ చూడాలి’ అని అల్కరాస్ చెప్పాడు. అల్కరాస్ స్పెయిన్‌కు చెందిన ప్లేయర్ అన్న విషయం తెలిసిందే.
21 ఏళ్ల కార్లోస్ అల్కరాస్ నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచాడు. 2022లో యుఎస్ ఓపెన్ నెగ్గిన అల్కరాస్.. 2023 వింబుల్డన్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాదిలో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచాడు. ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచిన ఆరో ఆటగాడిగా అల్కరాస్ నిలిచాడు. ఇక వింబుల్డన్ 2024 విజేత అల్కరాస్‌కు 27 లక్షల పౌండ్ల (రూ. 29 కోట్ల 23 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది.