కేప్ టౌన్ టెస్ట్ మ్యాచ్‌లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ఆస్ట్రేలియా ఆటగాడు కెమెరాన్ బ్యాన్‌క్రాఫ్ట్ ఎనిమిదేళ్ల తర్వాత తన మౌనాన్ని వీడి సంచలన విషయాలను బయటపెట్టారు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో తాము బంతిని మార్చడానికి సాండ్‌పేపర్ ఉపయోగించామని, అయితే ఈ కుట్ర వెనుక తన ఒక్కడి పాత్రే కాకుండా జట్టు మేనేజ్మెంట్, కోచ్‌లు, ప్రధాన ఆటగాళ్లందరి ప్రమేయం ఉందని ఆయన స్పష్టం చేశారు. మ్యాచ్‌పై పట్టు సాధించాలనే తీవ్రమైన ఒత్తిడిలో భాగంగా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ ఆలోచన ఇచ్చారని, తనపై కెమెరాల నిఘా ఎక్కువగా ఉన్నందున జట్టులో కొత్తవాడైన తనను ఈ పని చేయమని కోరారని బ్యాన్‌క్రాఫ్ట్ వివరించారు. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఆశతో, తప్పు అని తెలిసినా తాను అందుకు అంగీకరించానని చెప్పారు.
ఈ కుట్ర గురించి ప్రధాన కోచ్ డారెన్ లీమన్, బౌలింగ్ కోచ్ డేవిడ్ సాకర్‌తో పాటు ఆ జట్టులోని బౌలర్లందరికీ ముందే పూర్తి సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. మైదానంలో తాను బంతిని రుద్దిన తర్వాత, అది సరిగ్గా రివర్స్ స్వింగ్ అవుతుందో లేదో అని పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్, వికెట్ కీపర్ టిమ్ పెయిన్ తనను నిరంతరం అడుగుతూ సలహాలు ఇచ్చేవారని తెలిపారు. ఒక దశలో తన కదలికలు కెమెరాలకు చిక్కే ప్రమాదం ఉందని భావించి కోచ్ లీమన్ వాకీ-టాకీ ద్వారా హెచ్చరించారని కూడా వెల్లడించారు. అయితే ఆ జట్టులోని మీడియా మేనేజర్ కేట్ హచిసన్ మాత్రం ఇది తప్పు అని బహిరంగంగా వ్యతిరేకించి ఆ చర్చ నుంచి బయటకు వెళ్లిపోయారని గుర్తుచేసుకున్నారు.
మ్యాచ్ సమయంలో తాను కెమెరాలకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన తర్వాత, ప్రెస్ మీట్లో అసలు నిజాన్ని దాచిపెట్టాలని కోచ్ డేవిడ్ సాకర్, మేనేజ్మెంట్ ఒత్తిడి తెచ్చారని బ్యాన్‌క్రాఫ్ట్ చెప్పారు. సాండ్‌పేపర్ వాడినట్లు ఒప్పుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయనే భయంతో, మైదానంలో దొరికిన టేప్, మట్టిని ఉపయోగించామని అబద్ధం చెప్పాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ తర్వాత 2021లో బౌలర్లకు ఈ విషయం తెలుసా అని అడిగినప్పుడు తాను ఇచ్చిన సమాధానంతో బౌలర్లు తమకు ఏమీ తెలియదని ప్రకటనలు విడుదల చేయడం తనను ఎంతో బాధించిందన్నారు. తన శిక్షా కాలం పూర్తయిన తర్వాత దేశవాళీ క్రికెట్లో అత్యధిక పరుగులు, సెంచరీలు చేసినా, ఈ వివాదం కారణంగానే తనకు మళ్లీ ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కలేదని వాపోయారు. ఎనిమిదేళ్లుగా ఈ తప్పుల భారాన్ని తన ఒక్కడిపైనే మోస్తూ నలిగిపోయానని, ఉస్మాన్ ఖ్వాజా పుస్తకం విడుదలైన తర్వాత అభిమానులకు అసలు నిజం తెలియాలనే ఉద్దేశంతోనే ఇప్పుడీ నిజాలన్నీ బయటపెడుతున్నానని ఆయన స్పష్టం చేశారు.

