NTV Telugu Site icon

Bypolls Results 2023:త్రిపుర, ఉత్తరాఖండ్‌లో బీజేపీ.. కేరళలో కాంగ్రెస్, బెంగాల్‌లో తృణమూల్ గెలుపు

Bypolls Results 2023

Bypolls Results 2023

Bypoll Results 2023: సెప్టెంబర్‌ 5వ తేదీన ఉప ఎన్నికలు జరిగిన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు శుక్రవారం ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో చేపట్టారు. త్రిపురలో బీజేపీకి చెందిన బిందు దేబ్‌నాథ్ సీపీఎం అభ్యర్థి కౌశిక్ చందాను 18,000 ఓట్లకు పైగా ఓడించగా, కేరళలో కాంగ్రెస్‌కు చెందిన చాందీ ఒమెన్ 36,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆరు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత బిందు దేబ్‌నాథ్‌కు మొత్తం 30,017 ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ఇండియా కూటమికి ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఒక పరీక్షగా పరిగణించబడుతున్నాయి.

ఏడు స్థానాల్లో ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్, ధన్‌పూర్ ఉన్నాయి. బాగేశ్వర్, బోక్సానగర్‌, ధన్‌పూర్ స్థానాలు బీజేపీకి కాగా, ఘోసీ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ, ధూప్‌గురి స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్, డుమ్రీని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కేరళలోని పుతుపల్లి కాంగ్రెస్‌కు దక్కాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారం జరిగిన ఉప ఎన్నికలో కేవలం 49.42 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జార్ఖండ్‌లోని డుమ్రీలో 64.84 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌లో 55.35 శాతం ఓటింగ్ నమోదైంది. మరోవైపు, త్రిపురలోని బోక్సానగర్, ధన్‌పూర్‌లో వరుసగా 86.34 శాతం, 81.88 శాతం ఓటింగ్ నమోదు కాగా, బెంగాల్‌లోని ధూప్‌గురిలో 74.35 శాతం నమోదైంది.

2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోసి స్థానంలో గెలుపొందిన దారా సింగ్ చౌహాన్ సమాజ్ వాదీ పార్టీకి రాజీనామా చేసి తిరిగి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఘోసీలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు దారాసింగ్ చౌహాన్‌ను బీజేపీ ఎంపిక చేసింది. మరోవైపు చౌహాన్‌పై పోటీ చేసేందుకు సమాజ్‌వాదీ పార్టీ సుధాకర్ సింగ్‌ను రంగంలోకి దించింది.

త్రిపురలోని ధన్‌పూర్‌ ఎమ్మెల్యే పదవికి కేంద్ర మంత్రి ప్రతిమా భూమిక్ రాజీనామా చేయడంతో అసెంబ్లీ ఖాళీగా ఉండటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.భూమిక్ సోదరుడు బిందు దేబ్‌నాథ్ ఉప ఎన్నికల కోసం ధన్‌పూర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఐ-ఎం) అభ్యర్థి కౌశిక్ చందాపై బీజేపీ తరపున పోరాడారు. ధన్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి బిందు దేబ్‌నాథ్ విజయం సాధించారు.

త్రిపురలోని బోక్సానగర్‌లో సీపీఐ (ఎంకె) ఎమ్మెల్యే సంసుల్ హక్ మరణంతో ఆ స్థానం ఖాళీ కావడంతో బీజేపీ, సీపీఐ (ఎం) పరస్పరం పోటీ పడ్డాయి. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు నెలకొంది. భాగేశ్వర్‌లో బీజేపీ ఎమ్మెల్యే చందన్‌రామ్‌ దాస్‌ మరణంతో ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ కురువృద్ధుడు ఊమెన్ చాందీ మరణంతో కేరళలోని పుతుపల్లి స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి అధికార పార్టీ సీపీఐ (ఎం) జైక్‌ సీ. థామస్‌ను బరిలోకి దించగా, కాంగ్రెస్‌ పార్టీ ఊమెన్‌ చాందీ కుమారుడు చాందీ ఊమెన్‌ను రంగంలోకి దింపింది.

జార్ఖండ్‌లోని డుమ్రీలో జేఎంఎం ఎమ్మెల్యే జాగర్నాథ్ మహ్తో మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీయే అధ్యర్థి యశోదా దేవ్, ఏఐఎంఐఎం అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండియా కూటమికి ప్రాతినిధ్యం వహించిన మహ్తో భార్య బేబీ దేవిని జేఎంఎం రంగంలోకి దించింది. ఈ ఎన్నికలో జేఎంఎం విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురిలో బీజేపీకి చెందిన బిష్ణు పదా రే మరణంతో ఉప ఎన్నిక జరగాల్సి వచ్చింది. పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లా ధూప్‌గురి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ పెట్టుకున్న ఆశలపై తృణమూల్ కాంగ్రెస్ నీళ్లుచల్లింది. ధూప్‌‌గురి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ 4,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2021లో జమ్మూకశ్మీర్‌లో జరిపిన ఉగ్రదాడిలో మృతిచెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ భార్య తపసి రాయ్ ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ మద్దతుగా ఎన్నికల బరిలోకి దిగిన సీపీఎం అభ్యర్థి ఐశ్వర్ చంద్ర రాయ్ మూడో స్థానంలో నిలిచారు.