Site icon NTV Telugu

BYD Seal EV కార్లలో బ్యాటరీ లోపం.. రీకాల్ చేసిన కంపెనీ..

Byd

Byd

BYD Seal EV: చైనా వాహన తయారీ సంస్థ BYD ఇండియా తన సీల్ (Seal) ఎలక్ట్రిక్ సెడాన్‌కు సంబంధించి స్వచ్ఛంద రీకాల్‌ను ప్రారంభించింది. వాహనంలో ఉపయోగించిన హై-వోల్టేజ్ బ్లేడ్ బ్యాటరీలో సంభవించే లోపాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న సీల్ కార్ యజమానులు తమ వాహనాలను సంబంధిత సర్వీస్ సెంటర్లకు తీసుకురావాలని BYD ఇండియా సూచించింది. ఇక, బ్యాటరీ ప్యాక్‌లోని కొన్ని సెల్స్‌లో లోపం ఉండే అవకాశం ఉందని సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్లు అనుమానిస్తున్నారు. ప్రభావితమైన వాహనాల సంఖ్యను కంపెనీ వెల్లడించక పోయినప్పటికీ, వినియోగదారుల భద్రత, వాహన విశ్వసనీయతను దృష్టిలో ఉంచుకుని ఈ జాగ్రత్త చర్యలు చేపట్టింది.

Read Also: Gold Rates: పెళ్లిళ్ల సీజన్‌ ముందు షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర

అయితే, సీల్ యజమానులు ముందుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని సర్వీస్ సెంటర్‌ను సందర్శించాలి అని BYD ఇండియా పేర్కొనింది. అక్కడ వాహనంపై ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (OBD) పరీక్ష నిర్వహించి బ్యాటరీ సెల్స్‌లో ఎలాంటి సమస్య ఉందో గుర్తిస్తారు. లోపం తేలితే, వినియోగదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా మొత్తం బ్యాటరీ ప్యాక్‌ను మారుస్తామని కంపెనీ స్పష్టం చేసింది. సర్వీస్ సెంటర్‌కు వాహనాన్ని తీసుకురావడం సాధ్యం కానీ వినియోగదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని వెల్లడించింది. తమ సిబ్బంది యజమాని వద్ద నుంచి వాహనాన్ని సేకరించి సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి, తనిఖీ పూర్తయిన అనంతరం తిరిగి అందజేస్తారు.. ఎక్కువ వాహనాలు అదే రోజు యజమానులకు తిరిగి అందజేయనున్నట్లు BYD తెలిపింది.

Read Also: ENE 2 : రూ. 40 కోట్ల భారీ బడ్జెట్ తో థాయిలాండ్ లో టీమ్ కన్యారాసి..

ఇక, ఈ రీకాల్ కేవలం సీల్ మోడల్‌కే పరిమితమై ఉందని BYD ఇండియా ప్రకటించింది. భారత్‌లో విక్రయిస్తున్న ఇతర BYD ఎలక్ట్రిక్ వాహనాలకు ఇది వర్తించదని కంపెనీ స్పష్టం చేసింది. సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను 61.44 కిలోవాట్ అవర్ (kWh), 82.56 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో ప్రవేశ పెట్టారు. ఈ మోడల్ డైనమిక్ (స్టాండర్డ్ రేంజ్), ప్రీమియం (ఎక్స్‌టెండెడ్ రేంజ్), పర్ఫార్మెన్స్ (ఆల్-వీల్ డ్రైవ్) అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధరలు ఎక్స్-షోరూమ్‌గా రూ.41 లక్షల నుంచి రూ.53.15 లక్షల వరకు ఉన్నాయి. కాగా, BYD అభివృద్ధి చేసిన బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ భద్రత, అధిక ఎనర్జీ డెన్సిటీకి ప్రసిద్ధి చెందింది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. వాహన భద్రత, పని తీరుపై తయారీ సంస్థలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Exit mobile version