NTV Telugu Site icon

Business Headlines 06-03-23: మహిళలకు ఇప్పుడు బంగారం మీద లేదంట మోజు. మరిన్ని వార్తలు

Business Headlines 06 03 23

Business Headlines 06 03 23

Business Headlines 06-03-23:

తలసరి ఆదాయం లక్షా 72,000

భారతదేశ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద లక్షా 72 వేల రూపాయలుగా నమోదైందని జాతీయ గణాంక కార్యాలయం..NSO తెలిపింది. గడచిన 8 ఏళ్లలో ఇది సుమారు 99 శాతం పెరగటం చెప్పుకోదగ్గ విషయం. అయితే.. ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద ఇంతగా ఉండేది కాదని ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్‌ అన్నారు. తలసరి ఆదాయంలో పెరుగుదల వల్ల పేదలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ISID డైరెక్టర్‌ నగేష్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు.

లేడీసూ.. రియల్‌ ఎస్టేట్‌ వైపే..

ఆడవాళ్ల దగ్గర డబ్బులుంటే ఆభరణాలు కొనేందుకే ఆసక్తి ప్రదర్శిస్తారనే రోజులు పోయాయి. వాళ్లు కూడా ఇప్పుడు భూమి పైన పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నారని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ అనరాక్‌ తన సర్వేలో గుర్తించింది. స్టాక్ మార్కెట్ పట్ల 20 శాతం మంది, బంగారం వైపు 8 శాతం మంది, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల దిశగా 7 శాతం మంది మొగ్గు చూపారని స్పష్టం చేసింది. 5 వేల 500 మంది అభిప్రాయాలను అధ్యయనం చేయగా ఈ అంశాలు తేలినట్లు పేర్కొంది. ఇందులో సగం మంది మహిళలేనని అనరాక్‌ సర్వే వెల్లడించింది.

ఆర్బీఐ మాజీ గవర్నర్‌ ఆందోళన

భారతదేశ ఆర్థిక వృద్ధి అత్యంత ప్రమాదకరమైన సంకేతాలను అందిస్తోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది.. హిందూ తరహా వృద్ధిని తలపిస్తోందని అన్నారు. ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడులు తగ్గటం, వడ్డీ రేట్లు పెరగటం, ప్రపంచ వృద్ధిలో మందగమనం దీనికి ప్రధాన కారణాలని తెలిపారు. 1950-80 మధ్య కాలంలో ఇండియా వృద్ధి యావరేజ్‌గా 4 శాతంగా నమోదైంది. దీన్నే.. హిందూ తరహా వృద్ధి అంటుంటారు. భారతదేశ వృద్ధి పడిపోతోందనటానికి ఇటీవల NSO విడుదల చేసిన డేటానే నిదర్శనమని చెప్పారు.

‘ఐడబ్ల్యూఎన్‌’ హెడ్‌గా విద్యారెడ్డి

ఇండియా ఉమెన్‌ నెట్‌వర్క్‌.. IWN.. తెలంగాణ చాప్టర్‌ చైర్‌ ఉమెన్‌గా జి.విద్యారెడ్డి నియమితులయ్యారు. ఆమె ఈ పదవిలో ఏడాది పాటు ఉంటారు. విద్యారెడ్డి.. జి.పుల్లారెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీకి వైస్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదిలాఉండగా.. IWNకి వైస్‌ చైర్‌ ఉమెన్‌గా అమేజాన్‌కి చెందిన తనుజా అబ్బూరి నియమితులయ్యారు. ఈమె.. అమేజాన్‌లో ఆసియా పసిఫిక్‌ రీజియన్‌ DEI లీడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. IWN అనేది ఇండియా పరిశ్రమ సమాఖ్య.. CIIకి అనుబంధ విభాగం అనే సంగతి తెలిసిందే.

ఆంధ్రా పేపర్‌ కొత్త యూనిట్‌ ప్లాన్‌

ఆంధ్రా పేపర్‌ లిమిటెడ్‌ సంస్థ.. విస్తరణ ప్రణాళికను వెల్లడించింది. కంపెనీ సామర్థ్యాన్ని పెంచుకోవటంలో భాగంగా రాజమండ్రికి దగ్గరలోని కడియం ప్రాంతంలో కొత్త యూనిట్‌ని ఏర్పాటుచేస్తోంది. సంవత్సరానికి రెండున్నర లక్షల టన్నుల పల్ప్‌ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పేపర్‌ బోర్డ్‌ కెపాసిటీని రెండూ పాయింట్‌ మూడు ఎనిమిది లక్షల టన్నులకు చేర్చనుంది. ఈ మేరకు దాదాపు 2 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీనివల్ల 2 వేల 300 మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించింది.

‘సాఫ్ట్‌వేర్‌’కి కేరాఫ్‌ హైదరాబాద్‌

సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ల నియామకాల విషయంలో హైదరాబాద్‌ ప్రపంచవ్యాప్తంగా పదో స్థానం సొంతం చేసుకుంది. భాగ్య నగరం నుంచి జరుగుతున్న సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో గడచిన ఎనిమిదేళ్లలో ఏటా 15 శాతానికి పైగా గ్రోత్‌ నమోదవుతోంది. ఈ విషయాలను కరత్‌ డాట్‌ కామ్‌ అనే HR సంస్థ తన రిపోర్ట్‌లో పేర్కొంది. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ల నియామకాలు అమెరికా తర్వాత ఇండియాలోనే అత్యధికంగా జరుగుతున్నాయి. మన దేశంలో చెన్నై, గుర్‌గావ్‌, బెంగళూరు, పుణె, ముంబై వంటి నగరాల్లో అత్యధికంగా ఉన్నాయి. ఈ సిటీల్లో హైదరాబాద్‌ ముందు వరుసలో దూసుకెళుతోంది.