Site icon NTV Telugu

Business Headlines 04-02-23: ప్రేమికుల కోసం ప్రత్యేక ఆఫర్. మరిన్ని వార్తలు.

Business Headlines 04 02 23

Business Headlines 04 02 23

Business Headlines 04-02-23:

తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్ల అప్‌డేషన్‌

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్లాంట్లని ఆధునికీకరించే ప్రణాళికలను ఇండియా సిమెంట్స్‌ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు 16 వందల కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు పేర్కొంది. ఇండియా సిమెంట్స్‌కి తెలంగాణలోని మల్కాపూర్‌ మరియు విష్ణుపురంలలో పాత ప్లాంట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిలంకూర్‌, ఎర్రగుంట్లలో కూడా ఉన్నాయి. ఈ ప్లాంట్లను ఆధునికీకరించే ప్రక్రియ ఏడాదిన్నర వరకు పట్టొచ్చని ఇండియా సిమెంట్స్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ ఎన్‌.శ్రీనివాసన్‌ తెలిపారు. తమ సంస్థ డిసెంబర్‌ త్రైమాసికంలో 133 కోట్ల రూపాయలకు పైగా నికర లాభాలను ఆర్జించిందని చెప్పారు.

నో ప్రాబ్లమన్న నిర్మలా సీతారామన్‌

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ నేపథ్యంలో అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువ పడిపోతుండటంపై కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పందించాయి. మన స్టాక్‌ మార్కెట్లు, ఎకానమీ, బ్యాంకింగ్‌ రంగం పటిష్టంగా ఉన్నాయని చెప్పాయి. ఇన్వెస్టర్లు, డిపాజిటర్లు, పాలసీ హోల్డర్లు తమ డబ్బు గురించి భయపడాల్సిన పనిలేదని హామీ ఇచ్చాయి. ఒక్క సంస్థపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఆందోళన చెందొద్దని, ఈ సమస్య టీ కప్పులో తుపానులాగ సమసి పోతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా కల్పించారు. అదానీ గ్రూపుకి వివిధ బ్యా్ంకులు ఇచ్చిన లోన్లను పరిశీలిస్తున్నామని RBI తెలిపింది.

రెడ్డీస్‌ చైర్మన్‌ సతీష్‌రెడ్డికి ఫెలోషిప్‌

హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ చైర్మన్‌ సతీష్‌రెడ్డి.. ముంబైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ నుంచి ఫెలోషిప్‌ అందుకున్నారు. సతీష్‌ రెడ్డి తండ్రి, రెడ్డీస్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు అంజిరెడ్డి ఈ సంస్థలోనే చదువుకున్నారు. దీంతో ఆయన జ్ఞాపకార్థం డాక్టర్‌ కె.అంజిరెడ్డి మెమోరియల్‌ ఫెలోషిప్‌ ఫర్‌ అఫర్డబుల్‌ బయోఫార్మాస్యుటికల్స్‌ను ఏర్పాటుచేశారు. ఈ ఫెలోషిప్‌ మొదట ఆయన కొడుక్కే రావటం విశేషం. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ గోవాలో నిర్వహించిన 4వ బయోసిమిలర్‌ వర్క్‌షాపులో సతీష్‌ రెడ్డి ఈ ఫెలోషిప్‌ను అందుకున్నారు.

వొడాఫోన్‌ ఐడియాకి కాస్త ఊరట

ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన వొడాఫోన్‌ ఐడియా సంస్థకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట కలిగింది. ఆ కంపెనీ చెల్లించాల్సిన వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చుకునేందుకు ఒప్పుకుంది. దీంతో వొడాఫోన్‌ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 33 పాయింట్‌ ఒకటీ నాలుగు శాతం వాటా దక్కుతుంది. తద్వారా.. అతిపెద్ద షేర్‌ హోల్డర్‌గా నిలవనుంది. వొడాఫోన్‌ ఐడియా కేంద్ర ప్రభుత్వానికి 16 వేల 133 కోట్ల రూపాయల వడ్డీ బకాయి పడింది. ఈ మేరకు 10 రూపాయల ఫేస్‌ వ్యాల్యూ కలిగిన 16 వేల 133 కోట్ల రూపాయల విలువైన షేర్లను బదిలీ చేసినట్లు కంపెనీ తెలిపింది.

ఎస్‌బీఐకి రికార్డ్‌ లెవల్లో లాభం

స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా డిసెంబర్‌ త్రైమాసికంలో విశేషంగా రాణించింది. రికార్డు స్థాయిలో 15 వేల 477 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. స్టాండలోన్‌ ప్రాఫిట్స్‌ 69 శాతం వృద్ధి చెంది 14 వేల 205 కోట్ల రూపాయలుగా నమోదైంది. SBI చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక లాభం కావటం విశేషం. గతేడాది ఇదే సమయంలో స్టాండలోన్‌ లాభం 8 వేల 432 కోట్ల రూపాయలు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో కూడా 13 వేల 265 కోట్ల రూపాయల లాభమే వచ్చింది. ఇదిలాఉండగా.. అదానీకి షేర్ల తనఖాపై ఒక్క రూపాయి కూడా లోన్‌ ఇవ్వలేదని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది.

ప్రేమికుల కోసం ప్రత్యేక ఆఫర్

ఈ నెల 14వ తేదీన ప్రేమికుల రోజు ఉండటంతో జోయాలుక్కాస్‌ సంస్థ ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. ‘బీ మైన్‌’ అనే పేరుతో వ్యాలెంటైన్‌ డే ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా.. ఉంగరాలు, పెండెంట్లు, బ్రేస్‌లెట్లు తదితర ప్రత్యేక ఆభరణాలను విక్రయించనుంది. ఈ ఆభరణాలపై 25 శాతం డిస్కౌంట్‌ ఇస్తామని జోయాలుక్కాస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తెలిపారు. ఈ ఆఫర్‌ 10 రోజులు మాత్రమే ఉంటుందని, 14వ తేదీన ముగుస్తుందని చెప్పారు. వినియోగదారులు నేరుగా జోయాలుక్కాస్‌ స్టోర్లకు వచ్చి ఆభరణాలను సెలెక్ట్‌ చేసుకోవచ్చని సూచించారు.

Exit mobile version