Site icon NTV Telugu

Business Headlines 03-03-23: ఇండియాలో వెండి తెరల కొరత. మరిన్ని వార్తలు

Business Headlines 03 03 23

Business Headlines 03 03 23

Business Headlines 03-03-23:

తెలంగాణకి ఫాక్స్‌కాన్‌ సంస్థ

ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు సంబంధించి అంతర్జాతీయంగా పేరొందిన సంస్థల్లో ఫాక్స్‌కాన్‌ ఒకటి. ఈ కంపెనీ తెలంగాణలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. భారీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని సర్కారు పేర్కొంది. ఎలక్ట్రానిక్స్‌ సెక్టార్‌లో ఇండియాకి వచ్చిన అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్లలో ఇదొకటని తెలిపింది. ఫాక్స్‌కాన్‌కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

అదానీ వాటాల అమ్మకం

గౌతమ్‌ అదానీ గ్రూప్‌.. రుణ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. సమీప భవిష్యత్తులో 2 బిలియన్‌ డాలర్ల లోన్‌ అమౌంట్‌ చెల్లించేందుకు ఫండ్‌ రైజింగ్‌ చేస్తోంది. దీనికోసం నాలుగు కంపెనీల్లోని మైనారిటీ వాటాలను అమెరికా సంస్థకు విక్రయిస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీల్లో షేర్ల అమ్మకం ద్వారా 15 వేల 446 కోట్ల రూపాయలు సమీకరించనుంది. ఈ వాటాలను అమెరికాకు చెందిన ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ జీక్యూజీకి విక్రయిస్తున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్‌లో ఫార్మా టీటీసీ

భారతదేశానికి ఫార్మా రాజధానిగా వెలుగొందుతున్న హైదరాబాద్‌లో మరో ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటుకాబోతోంది. భాగ్య నగరంలో ఫార్మా ఇండస్ట్రీ రోజురోజుకీ విస్తరిస్తుండటంతో నైపుణ్యాలు కలిగిన మానవ వనరులకు డిమాండ్‌ నెలకొంది. ఈ కొరతను తీర్చేందుకు టెక్నాలజీ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ని అందుబాటులోకి తేనున్నారు. ఈ మేరకు బల్క్‌ డ్రగ్‌ మ్యానిఫ్యాక్చరర్స్ అసోసియేషన్.. BDMA నిర్ణయం తీసుకుంది. ఈ సెంటర్‌ నిర్మాణానికి హెటిరో గ్రూప్‌ చైర్మన్‌ మరియు రాజ్యసభ ఎంపీ పార్థసారథిరెడ్డి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించటం విశేషం.

తిరుమల శ్రీవారి సేవలో

మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ కంపెనీ తిరుమల శ్రీవారి సేవలో తరించనుంది. త్వరలో TTDకి 10 విద్యుత్‌ బస్సులను ఉచితంగా ఇవ్వనుంది. ఈ సంస్థ తయారుచేసిన 50 ఎలక్ట్రిక్‌ బస్సులు ఇప్పటికే తిరుపతి, తిరుమల మధ్య రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. తమ సూచనలు, సలహాల మేరకు రూపొందించిన తొలి బస్సును TTD అధికారులు పరిశీలించారు. ఈ బస్సులు హైదరాబాద్‌కి దగ్గరలోని ప్లాంట్‌లో తయారవుతున్నాయి.

సింజెంటా సామాజిక సేవ

గ్లోబల్‌ స్థాయిలో ప్రసిద్ధి చెందిన అగ్రి కంపెనీ సింజెంటా.. తన భారత అనుబంధ విభాగమైన సింజెంటా ఇండియా ఆధ్వర్యంలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలను నెరవేరుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో ఒక చోట రోడ్డు పక్కన వ్యవసాయ మార్కెట్‌ను నిర్మించింది. 3 కోట్ల 30 లక్షల రూపాయల ఖర్చుతో 51 వేల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తెచ్చింది. సింజెంటా సంస్థ.. పంట రక్షణ ఉత్పత్తులతోపాటు విత్తనాలను విక్రయించటం ద్వారా ప్రజాదరణ పొందింది.

ఇండియాలో వెండి తెరలు

ఆర్థికంగా, జనాభాపరంగా ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ముందువరుసలో ఉన్న ఇండియాలో ఈ స్థాయిలో సినిమా థియేటర్లు లేవని గణాంకాలు చెబుతున్నాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే భారత్‌లో వెండి తెరల సంఖ్య తక్కువేనని డేటా వెల్లడిస్తోంది. అయితే.. ఇటీవల సినిమా హాళ్ల నిర్మాణం క్రమంగా పెరిగిందని, ఫలితంగా తోటి దేశాల సరసన ఇండియా చేరనుందని లెక్కలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ సినిమా రెవెన్యూ 2026 నాటికి శరవేగంగా పురోగతి చెందనుందని అంచనా వేస్తున్నారు.

Exit mobile version