BRS MLA Lasya Nanditha Dead: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున పటాన్‌చెరు ఓఆర్‌ఆర్ వద్ద కారు అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. లాస్య నందిత వయసు 33. బీఆర్‌ఎస్ యువ ఎమ్మెల్యే మృతి పట్ల తెలంగాణ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది.
దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తె లాస్య నందిత. 2023 ఫిబ్రవరిలో సాయన్న మరణించడంతో.. ఆ స్థానం నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత పోటీ చేశారు. ఈ టికెట్ కోసం స్థానిక నేతలు కొందరు గట్టి ప్రయత్నాలే చేసినా.. నందితపై మాజీ సీఎం కేసీఆర్ నమ్మకం ఉంచారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు.
2016లో కవాడిగూడ నుంచి లాస్య నందిత కార్పొరేటర్‌గా గెలిచారు. అయితే 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మాత్రం ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తండ్రి సాయన్న వెంటే ఉంటూ.. నియోజకవర్గంలో మంచి పట్టు పెంచుకున్నారు. అయితే రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న లాస్య నందిత.. ఇలా చిన్న వయసులో దుర్మరణం కావడం పట్ల పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఫిబ్రవరి 13వ తేదీన నల్లగొండలో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగింది. ఎమ్మెల్యే లాస్య నందిత ఆ సభకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారును నార్కట్‌పల్లి వద్ద ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే లాస్య నందిత వెళ్తున్న కారు ముందు టైర్ ఊడిపోయింది. ఆ ఘటనలో ఎమ్మెల్యే లాస్య తలకు స్వల్ప గాయమైంది. 10 రోజులు తిరగ్గముందే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు.