Brahmanandam: తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ కింగ్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. ఎన్నో సంవత్సరాలుగా దాదాపు వెయ్యికి పైగా సినిమాల్లో నటించి తనదైన కామెడీ టైమింగ్.. నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కమెడియన్ మాత్రమే కాదు.. సోషల్ మీడియా మీమ్ గాడ్ కూడా ఆయనే. ఎంతటి సీరియస్ పరిస్థితి అయినా.. కన్నీరు తెప్పించే బాధలో ఉన్నా.. ఆయన ఫోటో కనిపిస్తే చాలు పెదాలపైకి చిరునవ్వు రావాల్సిందే. అందుకే ఆయనను హాస్యబ్రహ్మా అని పిలుచుకుంటారు. అయితే.. అత్తిలిలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న బ్రహ్మానందాన్ని వెండితెరకు పరిచయం చేసిన ఘనత ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు దక్కుతుంది. నరేష్ హీరోగా నటించిన తాతావతారం మూవీలో తొలిసారిగా నటించారు బ్రహ్మానందం. ఈ సినిమాకు అంతగా గుర్తింపు రాలేదు.
READ MORE: DK Shivakumar: కుల సర్వేలో ఆభరణాల ప్రశ్నకు నో చెప్పిన డీకే.శివకుమార్.. బీజేపీ రియాక్షన్ ఇదే!
ఆ సినిమా అనంతరం దిగ్గజ తెలుగు దర్శకుడు జంధ్యాల 1987లో తెరకెక్కించిన ‘అహ నా పెళ్లంట’ సినిమాతో బ్రహ్మానందం కనీవినీ ఎరుగని రీతిలో గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రహ్మానందం కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా ఇదే. ఈ సినిమాతో బ్రహ్మానందం సినీ ప్రవేశానికి గట్టి పునాదులు పడ్డాయి. ఆ తర్వాత ఆయన నటించిన అన్ని సినిమాల్లో కామెడీ పటాసుళ్లా పేలింది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘డబ్బు’, ‘జంబ లకిడి పంబ’, ‘యమలీల’, ‘అల్లుడా మజాకా’, ‘బావగారు బాగున్నారా?’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మధుడు’, ‘సింహాద్రి’, ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘పోకిరి’, ‘ఢీ’, ‘కృష్ణ’, ‘జల్సా’, ‘రెడీ’, ‘కిక్’, ‘అదుర్స్’, ‘దూకుడు’, ‘జులాయి’, ‘బలుపు’, ‘అత్తారింటికి దారేది’ లాంటి సినిమాల్లో అద్భుతంగా కామెడీ పండించారు. తనకు ఇచ్చిన ఏ క్యారెక్టర్ అయినా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు బ్రహ్మానందం. ఆయన నటించడం వల్లే మంచి విజయాలు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం కలకగమానదు. అద్భుతన నటనతో 1,200కు పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు.
