Site icon NTV Telugu

Tamil Nadu Assembly Elections 2026: బీజేపీ ఇలా చేసిందేంటి?.. అన్నామలైకి బిగ్ షాక్ ఇచ్చిన కమలం పార్టీ..

Annamalai

Annamalai

Tamil Nadu Assembly Elections 2026: తమిళనాడు శాసనసభ ఎన్నికలకు గానూ భారతీయ జనతా పార్టీ (BJP) తన అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం, కూటమిలోని మొత్తం 27 శాసనసభ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రుల నుంచి మాజీ గవర్నర్ల వరకు ప్రముఖ నాయకులు ఉన్నారు. అయితే, ఈ జాబితా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలైని నిరాశపరిచింది. బీజేపీ జాబితాలో కె. అన్నామలై పేరు లేక పోవడం సంచలనంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమిళ రాజకీయాల్లో బీజేపీ రాజకీయ ఆశలను పెంచిన అన్నామలైని ఎన్నికల బరి నుంచి దూరంగా ఉంచాలన్న నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. సంస్థాగత వ్యూహం నుంచి ఎన్నికల ప్రచారం వరకు అన్నామలై పాత్ర విస్తృతంగా ఉంటుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అయితే, ఏఐఏడీఎంకేతో ఉన్న చేదు సంబంధాలే అన్నామలై ఎన్నికల బరి నుంచి తప్పించడానికి గల కారణమని భావిస్తున్నారు.

READ MORE: Infinix Note 60 Pro: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో వచ్చేస్తోంది.. 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, యాక్టివ్ మ్యాట్రిక్స్ ఫీచర్

ఈ బీజేపీ అభ్యర్థుల జాబితాలో కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ నుంచి మాజీ గవర్నర్ సుందరరాజన్ వరకు పలువురి పేర్లు ఉన్నాయి. దళిత వర్గానికి రిజర్వ్ చేసిన అవినాశి అసెంబ్లీ స్థానం నుంచి పార్టీ ఎల్. మురుగన్‌ను నామినేట్ చేసింది. ఇదిలా ఉండగా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ మైలాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేయనున్నారు. కోయంబత్తూరు (ఉత్తర) స్థానం నుంచి పార్టీ వి. శ్రీనివాసన్‌ను నామినేట్ చేసింది. బీజేపీ సత్తూరు నుంచి నైనార్ నాగేంద్రన్‌ను, తిరుప్పూర్ (దక్షిణ) నుంచి ఎస్. తంగరాజ్‌ను బరిలోకి దింపింది. ఇక.. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే.. ఎన్డీయే కూటమిలోని బీజేపీ సహా కీలక భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకం ఒప్పందాన్ని అన్నాడీఎంకే గతంలో ఖరారు చేసింది. బీజేపీ 27 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అంటే బీజేపీ మొత్తం 27 స్థానాల్లో మాత్రమే పోటీ చేయనుంది. తమిళనాడులో కమలాన్ని వికసింపజేయడానికి కృషి చేస్తున్న బీజేపీ, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో భాగస్వామిగా ఉంది. ఈసారి ఆ పార్టీ కేవలం సంఖ్యాబలం మీద కాకుండా, గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న వ్యూహాత్మకంగా ముఖ్యమైన సీట్లను దక్కించుకోవడంపై ఎక్కువ దృష్టి సారించింది. గత అసెంబ్లీ ఎన్నికలలో (2021), తమిళనాడులోని 20 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపిన విషయం గమనార్హం. అయితే, ఆ సమయంలో పార్టీ కేవలం నాలుగు సీట్లను మాత్రమే గెలుచుకోగా, గెలుపు శాతం నామమాత్రంగా( 20 శాతం) ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో 20 శాతం వద్ద నిలిచిపోయిన బీజేపీ ఓట్ల వాటా, లోక్‌సభ ఎన్నికలలో 11 శాతానికి పడిపోయింది. రాష్ట్రంలో పార్టీ పునాది బలపడిందనడానికి ఇది ఒక సంకేతంగా భావించారు.

Exit mobile version