NTV Telugu Site icon

Telangana Assembly Elections 2023: బీజేపీకి జనసేన ప్లస్సా..? బీజేపీనే జనసేనకు ప్లస్సా..?

Bjp

Bjp

Telangana Assembly Elections 2023: తెలంగాణలో అనూహ్య రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. మొన్నటిదాకా జంపింగులు ఆశ్చర్యపరచగా.. ఇప్పుడు పొత్తులు కూడా అదే విధంగా అనూహ్యంగా ఖరారయ్యాయి. అసలు బీజేపీ, జనసేన పొత్తు గురించి కొద్దిరోజుల క్రితం వరకు చర్చే లేదు. జనసేన పోటీ చేయదనే అందరూ భావించారు. తర్వాత పవన్ జాబితా పంపటమే అనూహ్యం. ఆ తర్వాత బీజేపీ నుంచి పవన్ కు పిలుపు రావటం, పొత్తు ఖరారవటం అంతా నాటకీయంగా జరిగిపోయింది. ఏపీలో తమను కాదని ముందుకెళ్తున్న పవన్ ను.. బీజేపీ దగ్గరకు తీస్తుందా.. లేదా అనే సందేహాలు వచ్చాయి. కానీ ఇప్పుడు అవన్నీ పటాపంచలయ్యాయి.

ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన.. తెలంగాణలో మాత్రం బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. పవన్ తో చర్చల తర్వాత జనసేనకు 8 సీట్లు ఇవ్వటానికి బీజేపీ అంగీకరించింది. అటు పవన్ కూడా బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో మోడీతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ పొత్తుల వ్యవహారం తెలంగాణకు మాత్రమే పరిమితం అవుతుందా లేదంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమతో ఎవరు కలిసి వచ్చినా వైసీపీ సర్కార్ పై ఉమ్మడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అంటే బీజేపీ కూడా జనసేనతో కలిసి టీడీపీకి మద్దతు ఇస్తుందా ? మరి ఎలా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ బీజేపీతో సంబంధం లేకుండా చంద్రబాబుతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్న పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తు గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు. తెలంగాణ బీజేపీ నేతలతో రాసుకుపుసుకొని తిరుగుతున్న పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ నేతలతో మాత్రం అంటిముట్టుగానే వ్యవహరిస్తున్నారు. కానీ తెలంగాణలో అనూహ్యంగానే పొత్తు కుదిరిందని, ఇదే విధంగా ఏపీలో జరగదని ఏముందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. నిజానికి తెలంగాణలో కూడా పవన్ వైపు నుంచి పొత్తు ప్రతిపాదన రాలేదు. దాదాపు 32 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందంటూ పవన్ ముందే ఈసీకి జాబితా పంపారు. ఆ తర్వాతే బీజేపీ నుంచి పవన్ కు పొత్తు ప్రతిపాదన వచ్చింది. ఢిల్లీలో అమిత్ షా దగ్గర జరిగిన సమావేశంలో బీజేపీ, జనసేన పొత్తు ప్రాథమికంగా ఖరారైంది. సీట్ల సంగతి మీరు చర్చించుకోవాలని ఆయన సూచించారు. ఆ తర్వాత హైదరాబాద్ పవన్ నివాసంలో జరిగిన సమావేశంలో సీట్ల సర్దుబాటు జరిగింది.

ఇక్కడ బీజేపీ మొదట సింగిల్ గా పోటీకి సిద్ధపడి.. మళ్లీ జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకుందనే ప్రశ్నలు వస్తున్నాయి. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసినా ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోయారు. ఫోకస్ పెట్టిన ఏపీలోనే ఈ పరిస్థితి ఉండగా.. ఫోకస్ పెట్టని తెలంగాణలో జనసేన పార్టీకి ప్రజా మద్దతు ఉందా.. లేదా అనే ప్రశ్నకు పోలింగ్ తర్వాతే సమాధానం తెలుస్తుంది. జనసేన బలం ఎంత అనే విషయం పక్కనపెడితే.. పొత్తు పెట్టుకుంటే పోయేదేముందనే ధోరణిలో బీజేపీ ఆలోచించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి ఓట్ల చీలిక నివారించటమే ప్రధాన కారణం అనే వాదన కూడా ఉంది. జనసేన ఒంటరి పోరు కారణంగా.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల ప్రతిపక్షాలకు గెలిచే అవకాశాలు తగ్గించినట్లవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని భావిస్తున్న పవన్ కళ్యాణ్.. తెలంగాణలో అలా ఎందుకు ఆలోచించట్లేదనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయంలో పునరాలోచించాలని పవన్ ను బీజేపీ కోరడంతో.. ఆయన కూడా పొత్తుకు సుముఖత వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రానికో రకంగా రాజకీయం చేస్తున్న్ పవన్ అడుగులు.. అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. మారుతున్న రాజకీయానికి అనుగుణంగా వ్యూహాలు కూడా మారాల్సిందేనని జనసేనాని ఫిక్సైనట్టు కనిపిస్తోంది. అటు బీజేపీ కూడా ఇక ఉమ్మడి వ్యూహం పనిచేయదని డిసైడైందని, అందుకే తెలంగాణ, ఏపీకి వేర్వేరు వ్యూహాలతో ముందుకెళ్లొచ్చనే వాదన వినిపిస్తోంది. ఇంతకూ బీజేపీ, జనసేన కూటమికి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ప్రశ్నార్థకంగా ఉంది. అసలు జనసేన బీజేపీకి ప్లస్సా, లేకపోతే బీజేపీనే జనసేనకు ప్లస్సా అనేది తేలాలి. దొందూ దొందే అనేది మరికొందరి మాట.ప్రస్తుతానికి ఏదీ తేల్చిచెప్పలేం. అటు క్షేత్రస్థాయిలో రెండు పార్టీలూ బలహీనంగా ఉన్న మాట నిజం. కొన్నాళ్ల క్రితం ఊపు మీదున్న బీజేపీ.. ఇప్పుడు చల్లారిందనే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పొత్తు ఎంతో కొంత హెల్ప్ అవుతుందనే లెక్కేసుకున్నట్టు కనిపిస్తోంది. అటు పవన్ కు కూడా పోటీ గురించి క్యాడర్ నుంచి ఒత్తిడి ఉంది. అలాంటప్పుడు పొత్తులో ఎన్నికలకు వెళ్తే మంచిదే కదా అని ఆయన ఆలోచించి ఉండవచ్చు. మొత్తం మీద ఉభయకుశలోపరిగా పొత్తును మలుచుకోవాలనే వ్యూహం రచించారు. మరి ప్రచారం ఎలా ఉంటుంది.. పొత్తు ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎలా ఉంటుందనేది తేలాల్సిన విషయం.