Scavenger As Deputy Mayor: గత 40 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసిన మహిళను ఉన్నత పదవికి ఎన్నుకోవడం ద్వారా బీహార్‌లోని గయాలో జరిగిన పౌర సంస్థల ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గయా డిప్యూటీ మేయర్‌గా చింతాదేవి ఎన్నికయ్యారు. అయితే ఇలాంటి మైలురాయి గయాకు కొత్త కాదు. వృత్తి రీత్యా స్టోన్ క్రషర్ అయిన అత్యంత అట్టడుగున ఉన్న ముసహర్ కమ్యూనిటీకి చెందిన భగవతీ దేవి, 1996లో నితీష్ కుమార్‌కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) పార్టీ తరఫున పోటీ చేసి గయా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
“గయా అనేది ప్రజలు జ్ఞానోదయం కోరుకునే ప్రదేశం, అలాగే ఒక ముసహర్ మహిళ లోక్‌సభకు వెళ్లే ప్రదేశం కూడా ఇదే. ఈసారి ఇక్కడి ప్రజలు చింతా దేవిని ఎన్నుకోవడం ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. ఇక్కడ మరుగుదొడ్లు తక్కువగా ఉన్నప్పుడు పారిశుద్ధ్య సిబ్బందిగా తలపై మానవ మలాన్ని మోసుకెళ్లేవారు. ఇది చారిత్రాత్మకం.” అని గయా మేయర్‌గా ఎన్నికైన గణేష్ పాశ్వాన్ అన్నారు. చింతా దేవి పారిశుద్ధ్య కార్మికురాలిగా, కూరగాయల అమ్మకందారుగా కూడా పనిచేశారు. మాజీ డిప్యూటీ మేయర్ మోహన్ శ్రీవాస్తవ కూడా చింతాదేవికి మద్దతు పలికారు. ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించారని, నగర ప్రజలు, అణగారిన వర్గాలకు అండగా ఉంటారని, వారిని సమాజంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తారని అన్నారు.
NIA: ఎన్‌ఐఏ ఆల్‌టైం రికార్డు.. 2022లో 73 కేసులు, 456 మంది అరెస్ట్
తాజాగా జరిగిన ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ పదవికి చింతా దేవితో పాటు మరో 10 మంది పోటీ చేశారు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఆమెకు రికార్డు స్థాయిలో 50,417 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థిపై 16వేలకు పైగా మెజార్టీతో ఆమె విజయం సాధించారు. ఓ పారిశుద్ధ్య కార్మికురాలు ఈ పదవి చేపట్టడం గయ చరిత్రలో ఇదే తొలిసారి.