Site icon NTV Telugu

Bihar: బలపరీక్షకు ముందే స్పీకర్‌ రాజీనామా.. భావోద్వేగ ప్రసంగం అనంతరం..

Vijaykumar Sinha

Vijaykumar Sinha

Bihar: బిహార్‌లో కొత్తగా ఏర్పడిన సర్కారు బలపరీక్షకు ముందే కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తనపై అధికార ‘మహాగట్బంధన్’ (మహాకూటమి) ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగంతో కూడిన ప్రసంగం అనంతరం సభా వేదికపై తన రాజీనామాను ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు ఆమోదయోగ్యం కావని ఆయన వెల్లడించారు. బీజేపీకి చెందిన విజయ్‌ కుమార్ సిన్హా శాసనసభను విశ్వాస ఓటుకు ముందు సభను వాయిదా వేసి గందరగోళం నడుమ బయటకు వెళ్లారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కాషాయ కండువాలు ధరించి ‘భారత్ మాతా కీ జై’ , ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తూ అదే బాట పట్టారు. బలపరీక్షకు నేతృత్వం వహించాల్సిందిగా జనతా దళ్ యునైటెడ్‌కు చెందిన నరేంద్ర యాదవ్ పేరును విజయ్‌ కుమార్ సిన్హా సూచించారు.

అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా దాదాపు భావోద్వేగంగా ప్రసంగించారు. ఆకస్మికంగా ప్రభుత్వం మారిన తర్వాత సొంతంగా రాజీనామా చేయాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. కానీ అంతకుముందు సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసు అస్పష్టంగా ఉందని, నియమ నిబంధనలు పాటించలేదని తెలిపారు.

ఇదిలా ఉండగా.. బిహార్‌లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం బలపరీక్ష రోజే ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. బిహార్‌లో ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్, ముగ్గురు ఎంపీలు అష్ఫాక్ కరీం, ఫయాజ్ అహ్మద్, సుబోధ్ రాయ్‌లకు సంబంధించిన ఆస్తులపై దాడులు నిర్వహించారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ ఉదయం ఈ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించింది. ‘ల్యాండ్స్ ఫర్ జాబ్స్’ కుంభకోణానికి సంబంధించి సీబీఐ బుధవారం 25 వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించింది. ఢిల్లీ, హర్యానాలోని గురుగ్రామ్‌, బిహార్‌లోని పాట్నా, కతిహార్‌, మధుబనిలోని వివిధ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి

Exit mobile version