Bihar Girl Harassment: బీహార్‌లో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.. బాలికలను వేధిస్తున్న ఘటనలు బయటకు రావడంతో.. అసలు అక్కడ ఏం జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.. బీహార్‌లో మహిళలు, బాలికలపై వేధింపులకు సంబంధించిన వీడియోలు వరుసగా వెలుగులోకి వస్తున్న వేళ మరో ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాంకా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మందార్ పర్వత్‌లో ఓ బాలికను కొందరు యువకులు వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీడియో వైరల్ కావడంతో బౌన్సీ పోలీసులు ఆరుగురు గుర్తుతెలియని యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వైరల్ వీడియోలో ఏం ఉంది?
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో కొందరు యువకులు బాలిక చుట్టూ చేరి అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక యువకుడు ఆమె చేతిని పట్టుకుని మెలితిప్పినట్లు, మరో వ్యక్తి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తుందని పోలీసులు తెలిపారు. మరో యువకుడి చేతిలో కర్ర ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. ఈ వీడియోకు అల్లరి, దౌర్జన్యాన్ని ప్రోత్సహించేలా కనిపించే ఓ మ్యూజ్‌ను జోడించి సోషల్ మీడియాలో వైరల్ చేసినట్టు సమాచారం..
వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే దానిపై దర్యాప్తు
వీడియోపై సెప్టెంబర్ 3 తేదీ కనిపిస్తున్నప్పటికీ, ప్రాథమిక దర్యాప్తులో అది సుమారు ఆరు నెలల క్రితం చిత్రీకరించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన తేదీ, పరిస్థితులు, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తుల వివరాలను పోలీసులు నిర్ధారించే పనిలో పడపోయారు.. సెప్టెంబర్ 22న బౌన్సీ పోలీస్ స్టేషన్ సోషల్ మీడియా సెల్‌కు వాట్సాప్ ద్వారా వీడియో అందినట్లు అధికారులు తెలిపారు. అనంతరం పోలీసు బృందం మందార్ పర్వత్‌కు వెళ్లి వీడియోలో కనిపిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించింది.
ఆరుగురు గుర్తుతెలియని యువకులపై ఎఫ్‌ఐఆర్
వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆరుగురు గుర్తుతెలియని యువకులపై భారతీయ న్యాయ సంహిత (BNS), సమాచార సాంకేతిక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బౌన్సీ ఎస్‌డీపీవో ఇంద్రజిత్ బైఠా తెలిపారు.
జముయి, సమస్తిపూర్ ఘటనల తర్వాత మరో వీడియో
బాంకా ఘటన వెలుగులోకి రావడానికి కొద్ది రోజుల ముందు బీహార్‌లోని జముయి, సమస్తిపూర్ జిల్లాల్లోనూ బాలికలు, యువతులపై వేధింపులకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. సమస్తిపూర్ ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్టు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. జముయిలో కోచింగ్ నుంచి తిరిగి వస్తున్న పదో తరగతి బాలిక, ఆమెతో ఉన్న బాలుడిని కొందరు అడ్డుకుని వేధించి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేపట్టారు. ఇక, ముజఫర్‌పూర్‌లోనూ ఓ బాలికను కొట్టడం, వేధించారనే ఆరోపణలపై పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన మధేపురా వీడియోకు సంబంధించి పోలీసులు అది వేధింపుల ఘటన కాదని, విద్యార్థుల మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించినదని క్లారిటీ ఇచ్చారు.. ఇప్పుడు, మందార్ పర్వత్ ఘటనకు సంబంధించిన వీడియోలోని వ్యక్తుల గుర్తింపు, ఘటన జరిగిన అసలు తేదీ, పూర్తి పరిస్థితులపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు చేపట్టారు..

