Site icon NTV Telugu

Navalny: నావల్నీ కుటుంబాన్ని పరామర్శించిన బైడెన్‌

Joe

Joe

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin) రాజకీయ ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny) అనుమానాస్పద మృతి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తాజాగా ఆయన కుటుంబాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) పరామర్శించారు. జరిగిన పరిణామాలను తెలుసుకుని ఓదార్చారు.

కాలిఫోర్నియాలోని ఒక హోటల్‌లో నావల్నీ సతీమణి యులియా, కుమార్తె దాశాతో బైడెన్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఓదార్చారు. ఈ సమావేశం గురించి ఎక్స్‌(ట్విటర్) వేదికగా పోస్టు చేశారు. నావల్నీ మృతి వారికి తీరని లోటు అని.. ఆయన ధైర్యం కుటుంబ సభ్యుల్లో కొనసాగుతుందని బైడెన్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే నావల్నీ మృతితో రష్యాపై అమెరికా కొత్తగా మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పుతిన్‌పై అమెరికా తీవ్ర ఆగ్రహంగా ఉంది. బైడెన్ కూడా తీవ్ర పదజాలంతో పుతిన్‌ను దుమ్మెత్తిపోశారు. అతడి వెర్రిచేష్టలతో అణుప్రమాదం పొంచి ఉందని తాజాగా బైడెన్ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే రష్యాకు చెందిన పలువురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం ప్రపంచ వ్యాప్తంగా కలవరం రేపుతోంది. నావల్నీ మృతి తర్వాత ఇటీవల ఒక రష్యా పైలెట్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. కొంత మంది దుండగులు అతడ్ని కాల్చి చంపారు. ఒక విమానంతో అతడు ఉక్రెయిన్‌కు పారిపోయాడు. రష్యాకు ఇది తీవ్ర అవమానకరంగా మారింది. ఆ కారణం చేతనే అతడు ప్రాణాలు కోల్పోయి ఉండి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే తన కుమారుడి మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేయాలని రష్యా అధికారులు ఒత్తిడి తీసుకువచ్చారని నావల్నీ తల్లి లియుడ్మిలా వాపోయారు. ఈ మేరకు ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. ఎలాంటి అంతిమయాత్ర లేకుండా అంతా రహస్యంగా జరగాలని అధికారులు చెప్తున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తన కుమారుడిని కడసారి చూసేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె ఇప్పటికే అధ్యక్షుడు పుతిన్‌ను వేడుకున్నారు.

Exit mobile version