Bheems: భోగి సినిమా హిట్ కాకపోతే నా పేరు మార్చుకుంటా.. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంచలన శపథం!

Bheems

Bheems

వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో, శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. థియేటర్లలో ఈ సినిమా చూశాక తన మాట నిజం కాకపోతే ఏకంగా తన పేరు మార్చుకుంటానంటూ ఆయన వేదికపైనే సంచలన శపథం చేశారు. సినిమాపై తనకున్న నమ్మకాన్ని చాటుతూనే, తన 25 ఏళ్ల సినీ ప్రయాణంలోని కష్టాలు, అవమానాలు, తనను నిలబెట్టిన వ్యక్తుల గురించి గుర్తుచేసుకుని భీమ్స్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దర్శకుడు సంపత్ నందితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భీమ్స్ కంటతడి పెట్టుకున్నారు. 2003లో ‘ఆయుధం’ సినిమాలో తాను రాసిన ‘ఓయి రాజు’ పాటలోని ‘ఓయి’ అనే పదం నచ్చి సంపత్ నంది తనను పిలిపించారని తెలిపారు. అక్కడి నుంచి ఇంద్రనగర్‌లోని 101 నంబర్ రూమ్ తమ జీవితాలను మార్చిందని అన్నారు. తినడానికి తిండిలేని రోజుల్లో సంపత్ నంది ఇచ్చిన వంద రూపాయలతో తన ప్రయాణం మొదలైందని, ఒక పాట కోసం వంద వెర్షన్లు రాయించి తనను తీర్చిదిద్దారని కొనియాడారు.

‘బెంగాల్ టైగర్’ తర్వాత తాను, సంపత్ నంది కలిసి పనిచేయకపోవడంపై వస్తున్న ఊహాగానాలపై భీమ్స్ స్పందించారు. “మధ్యలో మేమిద్దరం కలిసి కనిపించకపోవచ్చు, వేదిక పంచుకోకపోవచ్చు.. కానీ మా మధ్య దూరం పెరిగినట్టే పెరిగి, ఇప్పుడు ఒకే తల్లి పిల్లల్లా కలిసిపోయాం. ఇప్పుడు ప్రపంచమే కుళ్లుకునే స్థాయికి మా బంధం చేరింది” అంటూ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘భోగి’ సినిమా కోసం హీరో శర్వానంద్, హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి పడ్డ కష్టాన్ని చూసి తాను షాక్ అయ్యానని భీమ్స్ చెప్పారు. “ఈరోజు నేను చెప్పే మాటలు రికార్డ్ అవుతున్నాయి. రేపు థియేటర్లలో సినిమా చూశాక భీమ్స్ చెప్పింది అక్షరాలా నిజమని మీరే అంటారు. అలా అనకపోతే నా పేరు మార్చుకుంటాను” అని ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిలో పూనకాలు తెప్పించాయి. ఈ సినిమాలోని ఓ ఎమోషనల్ సాంగ్ విన్నప్పుడు తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని, వెంటనే వెళ్లి గీత రచయిత చంద్రబోస్, దర్శకుడు సంపత్ నంది కాళ్లకు మొక్కానని భీమ్స్ వెల్లడించారు. చివరగా, ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినిమాను నిర్మించిన నిర్మాత రాధామోహన్‌ను కాపాడుకోవాలని, ‘భోగి’ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అండగా నిలవాలని భీమ్స్ కోరారు.