Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!

Bhadradri Kothagudem

Bhadradri Kothagudem

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు అటవీ ప్రాంతంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అటవీ ప్రాంతంలో కొంతమంది వేటగాళ్లు వైర్లు అమర్చి అడవి జంతువుల కోసం ఉచ్చులు ఏర్పాటు చేశారనే సమాచారం ఫారెస్ట్ కార్యాలయానికి రావడంతో, ఆరుగురు సిబ్బంది కలసి అటవీ ప్రాంతంలోకి తనిఖీల కోసం నడుచుకుంటూ వెళ్లారు. బూర్గంపాడు మండలం నకిరేపేట అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, వేటగాళ్లు అమర్చిన కరెంట్ తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో పాల్వంచ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చెరువు సింగారం బీట్‌లో పనిచేస్తున్న FBO బానోత్ నవీన్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన నవీన్ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకట తండాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారి కరెంట్ ఉచ్చులకు బలవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.