NTV Telugu Site icon

Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వాళ్లే టార్గెట్‌గా పోలీసుల చర్యలు!

Betting Apps Case

Betting Apps Case

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్స్‌ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. బెట్టింగ్‌ యాప్ నిర్వహకులే టార్గెట్‌గా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో 19 మంది యాప్‌ ఓనర్లపై కేసులు నమోదయ్యాయి. 19 మంది నిర్వహకులను నిందితులుగా చేర్చి మియాపూర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. సెలబ్రిటీలను సాక్షులుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నారు.

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారి స్టేట్‌మెంట్‌లను పోలీసులు రికార్డు చేశారు. చార్జిషీట్‌లో బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌పై ప్రచారం చేసిన ఇన్‌ఫ్యుయెన్సర్లను సైతం చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇల్లీగల్ బెట్టింగ్‌కు నిర్వహకులే బాధ్యులు అని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 66D కింద కూడా కేసులు నమోదయ్యాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 8 మందిపై, మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో 25 మందిపై కేసులు నమోదయ్యాయి.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో టీవీ యాంకర్‌ విష్ణుప్రియ, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ రీతూ చౌదరిలను పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే విచారించారు. వైసీపీ మహిళా నేత, టీవీ యాంక‌ర్ శ్యామ‌ల ఈరోజు పంజాగుట్ట పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్స్‌ కేసులో టాలీవుడ్‌ ప్రముఖులు రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌ రాజ్‌, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.