భారతీయ రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన, వేగవంతమైన వసతులు కల్పించే దిశగా మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా బెంగళూరు నుంచి ముంబై మధ్య కొత్తగా రెండో వందేభారత్ స్లీపర్ రైలును నడపడానికి రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ దసరా పండుగ సందర్భంగా ఈ అత్యాధునిక ప్రీమియర్ రైలు సేవలను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు సాగిస్తున్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ సుమారు 22 గంటల సమయం తీసుకుంటుండగా, ఈ కొత్త వందేభారత్ స్లీపర్ రైలు ద్వారా ఆ ప్రయాణ సమయం కేవలం 16 గంటలకు తగ్గనుంది.
ఈ నూతన వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ కేఎస్ఆర్ బెంగళూరు, ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య నడవనుంది. ఈ రైలు ప్రయాణం ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగనుండటం విశేషం. ఏపీలోని రాయలసీమ ప్రాంతమైన అనంతపురం, గుంతకల్ స్టేషన్లలో ఈ రైలుకు హాల్ట్ కల్పించారు. ఏపీలో ఈ రెండు స్టాపులతో పాటుగా రాయచూర్, కలబురగి, సోలాపూర్, పుణె, కల్యాణ్ తదితర ప్రధాన స్టేషన్లలో కూడా ఈ రైలు ఆగుతుంది.
ఈ సర్వీసును వారానికి ఆరు రోజులు క్రమం తప్పకుండా నడిపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం బెంగళూరులో ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు బయలుదేరే ఈ రైలు, మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబై చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ముంబైలో రాత్రి 10:30 గంటలకు బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 2:50 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. బెంగళూరు నుంచి సోమవారం, ముంబై నుంచి మంగళవారం ఈ సర్వీసులు అందుబాటులో ఉండవు.

