Bathukamma Festival: తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ సందడి కొనసాగుతోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఘనంగా నిర్వహించారు. ఓం శక్తి సత్సంగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు, భవాని మాల ధారణ ధరించిన భక్తులు పాల్గొని రకరకాల పూలతో చేసిన బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ నృత్యం చేశారు. అనంతరం గౌరీ మాతలను శిరస్సును ఎత్తుకొని అనపర్తి వీరులమ్మ ఆలయం వద్ద నుంచి వినాయకుని ఆలయం వరకు ఊరేగించారు. అనంతరం బతుకమ్మ నది జలాల్లో విడిచిపెట్టారు.
Read Also: Telangana : హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వమే అధిపత్యం.. మెట్రో టేకోవర్‌పై కీలక నిర్ణయం
బతుకమ్మ అంటే ఆడబిడ్డల పండుగ.. బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ.. పువ్వుల్లాంటి ఆడబిడ్డలు ప్రకృతి ఒడిలో పూసిన పూలతో చేసుకునే సంబురం బతుకమ్మ పండుగ. ప్రకృతిని అరాధించే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధానికి చిరునామాగా నిలుస్తుంది. ఈ పండుగను తెలంగాణ ప్రాంతం జనాలు సంబరంగా జరుపుకుంటారు. ‘బతుకమ్మ’ పండుగను తెలంగాణా రాష్ట్రంలో భాద్రపదమాస అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో బతుకమ్మ సంబురాలు కొనసాగుతున్నాయి. ఆడబిడ్డలు పూల పండుగతో సందడి చేస్తున్నారు.
