Site icon NTV Telugu

Bangladesh map Controversy: బంగ్లాదేశ్‌ మ్యాప్‌లో భారత ఈశాన్య రాష్ట్రాలు.. ఇది కండకావరమే!

Bangladesh Map Controversy

Bangladesh Map Controversy

Bangladesh map Controversy: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ తాజా చర్య భారతీయుల ఆగ్రహానికి గురి చేసింది. కొందరు ఇండియన్స్ ఈ చర్యను కండకావరమే అని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ – పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాకు వివాదాస్పద మ్యాప్‌ను అందజేశారు. ఈ మ్యాప్‌లో భారతదేశంలోని అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్‌లో భాగంగా చూపించారు. అనంతరం ఆయన పాకిస్థాన్ జనరల్‌తో తన సమావేశానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో భారతీయుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

READ ALSO: Cyclone Montha: ప్రజా ప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి.. కేడర్‌ సహాయక చర్యల్లో పాల్గొనాలి..

గతంలో కూడా ఇలాగే..
బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ మొహమ్మద్ యూనస్ ఢాకా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాను కలిశారు. ఈ సమయంలో యూనస్ పాక్ జనరల్‌కు “ది ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్” అనే పుస్తకాన్ని బహుకరించారు. దీని ముఖచిత్రంలో బంగ్లాదేశ్ వక్రీకరించిన మ్యాప్ ఉంది. ఈ మ్యాప్‌లో భారతదేశం ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ భూభాగంగా చిత్రీకరించి ఉన్నాయి. దీంతో కొత్త వివాదం తలెత్తింది. ఎందుకంటే ఈ చర్యలు గ్రేటర్ బంగ్లాదేశ్ కోసం రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ డిమాండ్లకు అనుగుణంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

యూనస్ భారతదేశ ఈశాన్య ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌ భూభాగంగా ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని నెలలుగా యూనస్ విదేశీ వేదికలపై భారతదేశ ఈశాన్య రాష్ట్రాల గురించి పదే పదే ఇదే విధంగా ప్రస్తావించారు. ఇంతలో ఆయన జనరల్ మీర్జాను కలిసి వివాదాస్పద మ్యాప్ ఉన్న పుస్తకాన్ని ఆయనకు బహుకరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో భారతీయుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. భారత సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకున్నందుకు ఆయనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం ఈ వివాదంపై ఇంకా స్పందించలేదు.

యూనస్ తన తొలి చైనా పర్యటన సందర్భంగా మాట్లాడుతూ.. “భారతదేశంలోని ఏడు రాష్ట్రాలు, భారతదేశ తూర్పు భాగం… అవి భూపరివేష్టిత ప్రాంతం. ఈ ప్రాంతాలకు సముద్రంలోకి ప్రవేశం లేదు. ఈ ప్రాంతానికి సముద్ర రక్షకులం మేమే. ఇది అపారమైన అవకాశాలను తెరుస్తుంది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థను విస్తరించగలదు” అని యూనస్ చైనా అధికారులతో అన్నారు. ఈ ప్రకటనపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ట్రాన్స్‌షిప్‌మెంట్ ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్..
ఈ చర్యల తరువాత.. భారత్ గట్టిగానే చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్ వస్తువులు నేపాల్, భూటాన్, మయన్మార్‌లకు చేరుకోవడానికి భారత భూభాగం గుండా వెళ్ళడానికి అనుమతించే ట్రాన్స్‌షిప్‌మెంట్ ఒప్పందాన్ని తాజాగా భారతదేశం రద్దు చేసింది. వీటిని పక్కన పెడితే మే నెలలో యూనస్ సన్నిహితుడు ఒకరు.. భారతదేశం పాకిస్థాన్‌పై దాడి చేస్తే, చైనా సహాయంతో బంగ్లాదేశ్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను విలీనం చేసుకోవాలని సూచించారు. అలాగే 2024లో కూడా యూనస్ మరో సన్నిహితుడు నహిదుల్ ఇస్లాం మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం ప్రాంతాలను బంగ్లాదేశ్‌లో భాగంగా చూపించే మ్యాప్‌ను విడుదల చేశారు. ఈ చర్య వివాదానికి దారి తీసింది. వివాదం కారణంగా తర్వాత ఆ పోస్ట్ తొలగించారు.

READ ALSO: Pakistan: యుద్ధ భయంతో విదేశాలకు పారిపోయిన పాక్ అగ్రనాయకత్వం..

Exit mobile version