Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి

Murder

Murder

Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై మరోసారి తీవ్ర కలకలం రేగింది. తాజాగా మణికట్టు వ్యాపారం చేసుకునే ఒక హిందూ జ్యువెలర్‌ దారుణ హత్యకు గురయ్యారు. మైమన్ సింగ్ జిల్లాలోని ఒక స్లూయిస్ గేట్ వద్ద నీటిలో తేలుతున్న ప్లాస్టిక్ డ్రమ్‌లో ఆయన మృతదేహం కనిపించడం అక్కడి స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చనిపోయిన వ్యక్తిని 50 ఏళ్ల నిరంజన్ చంద్ర సూత్రధార్‌గా గుర్తించారు. ఈయన అఠార్‌బాడీ బిల్డింగ్ ప్రాంతంలో ఒక జ్యువెలరీ షాపు నడుపుతూ, మైమన్ సింగ్‌లోని స్టేడియం ఏరియాలో భార్య, కొడుకుతో కలిసి ఒక అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. ‘దైనిక్ ఇత్తిఫాక్’ అనే బాంగ్లాదేశ్ పత్రిక కథనం ప్రకారం.. బేగున్‌బాడీ ప్రాంతంలోని స్లూయిస్ గేట్ వద్ద ఒక ప్లాస్టిక్ డ్రమ్ తేలుతూ ఉండడాన్ని స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ డ్రమ్‌ను తెరిచి చూడగా అందులో నిరంజన్ మృతదేహం బయటపడింది. ఆయన బాడీపై తీవ్ర గాయాల గుర్తులు ఉన్నాయి. దుండగులు ఆయనను హత్య చేసి, ఆ తర్వాతే మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టి నీటిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో ఆయన ట్రాజర్ జేబులో ‘మైమన్ సింగ్ హిందూ కోఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ లిమిటెడ్’కు చెందిన ఒక టోకెన్ దొరికింది. కోత్వాలి మోడల్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ రూహుల్ అమీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ టోకెన్ ఆధారంగానే పోలీసులు క్రెడిట్ యూనియన్‌ను సంప్రదించి, ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత నిరంజన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, ఆయన భార్య, కుమారుడు వచ్చి మృతదేహాన్ని చూసి గుర్తులను ధ్రువీకరించారు. నిజానికి నిరంజన్ సెప్టెంబర్ 20 నుంచే కనిపించకుండా పోయారు. ఆ రోజు ఆయనను స్టేడియం ప్రాంతంలో తన మేనల్లుడు చూశాడు. అయితే, నిరంజన్ గతంలో కూడా కొన్నిసార్లు ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి కొద్ది రోజులకు తిరిగి వచ్చేవారు. దాంతో ఈసారి కూడా అలాగే ఏదో పనిమీద వెళ్లి ఉంటారులే, రెండు రోజుల్లో వచ్చేస్తారని కుటుంబ సభ్యులు భావించారు. అందుకే ఆయన మిస్సింగ్ గురించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అంతలోనే ఇలా డ్రమ్‌లో శవమై తేలడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. శుక్రవారం ఉదయానికి కూడా ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులెవరనేది పోలీసులు గుర్తించలేకపోయారు, ఎవరినీ అదుపులోకి కూడా తీసుకోలేదు. అసలు ఆయనను ఎందుకు చంపారనే కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలతో బాంగ్లాదేశ్‌లో ఉన్న మైనారిటీ హిందూ సమాజం భద్రతపై మళ్లీ తీవ్రమైన చర్చ, ఆందోళన మొదలయ్యాయి.