Bangladesh: బంగ్లాదేశ్‌లోని ఫరీద్‌పూర్‌లో శుక్రవారం రాత్రి గందరగోళం నెలకొంది. ఆనందంగా ముగించాల్సిన ఓ పాఠశాల వార్షికోత్సవం అర్ధరాత్రి కల్లోలంగా మారింది. శుక్రవారం రాత్రి ఇస్లామిస్టు గుంపు ప్రముఖ రాక్ గాయకుడు జేమ్స్ నిర్వహించాల్సిన సంగీత కార్యక్రమంపై దాడి చేయడంతో షోను అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో కనీసం 20 మంది గాయపడ్డారు. స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం.. ‘నగర్ బౌల్’గా ప్రసిద్ధి చెందిన జేమ్స్ బంగ్లాదేశ్‌లోనే అతి పెద్ద రాక్ స్టార్‌గా గుర్తింపు పొందారు. ఫరీద్‌పూర్ జిల్లా స్కూల్ 185వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. వేలాది మంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. మరి కొద్ది నిమిషాల్లో కచేరీ ప్రారంభం అవ్వాల్సి ఉంది. ఇంతలో కొందరు దుండగులు వేదికపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వేదికపై ఇటుకలు, రాళ్లు విసిరారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.
READ MORE: Delhi: న్యూఇయర్ ముందు భారీ ఆపరేషన్.. 285 మంది అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
అధికారులు, ప్రత్యక్ష సాక్షుల ప్రకారం జేమ్స్ రాత్రి 9.30 గంటల సమయంలో వేదికపైకి రావాల్సి ఉంది. అంతకుముందే కొంతమంది బయటి వ్యక్తులు బలవంతంగా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో హింసాత్మక ఘర్షణలకు తెరలేపారు. వేదిక వైపు, ప్రేక్షకులపై రాళ్లు, ఇటుకలు విసిరారు. దీంతో జనాల్లో భయాందోళన చెలరేగింది.గాయపడిన వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది విద్యార్థులకు తల, చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులైన విద్యార్థులు దుండగులను క్యాంపస్ నుంచి తరిమివేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో నిర్వాహక కమిటీ కన్వీనర్ డాక్టర్ మోస్తఫిజుర్ రహ్మాన్ షమీమ్ వేదికపై నుంచి కచేరీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గందరగోళం మధ్య జేమ్స్ తృటిలో తప్పించుకున్నారు. భద్రతా సిబ్బంది ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లారు. జేమ్స్‌కు లేదా ఆయన బృంద సభ్యులకు గాయాలైనట్లు సమాచారం లేదు. కాగా.. ఫరీద్‌పూర్ జిల్లా స్కూల్ ను1840లో బ్రిటిష్ పాలనలో స్థాపించారు. ఈ పాఠశాల బంగ్లాదేశ్‌లోనే అత్యంత పాత ప్రభుత్వ విద్యాసంస్థలలో ఒకటి. గురువారం జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతం, ప్రమాణ స్వీకారం, పట్టణంలో రంగుల ఊరేగింపుతో వేడుకలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి సాంస్కృతిక ప్రదర్శనలు, లక్కీ డ్రా, జేమ్స్ ప్రదర్శన జరగాల్సి ఉండగా ఈ దాడితో వేడుకలు అర్ధాంతరంగా ముగిశాయి.
