Site icon NTV Telugu

Bengaluru cylinder blast: బెంగళూరులో విషాదం.. పదేళ్ల బాలుడు మృతి.. తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లు

01

01

Bengaluru cylinder blast: బెంగళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ బెంగళూరులోని విల్సన్ గార్డెన్‌లోని చిన్నయనపాల్య వద్ద శుక్రవారం సిలిండర్ పేలుడు ఘటనలో 10 ఏళ్ల బాలుడు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇళ్లకు దగ్గరగా, జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ పేలుడు సంభవించడంతో వెంటనే గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

READ MORE: pawan kalyan : ఇది అంతర్జాతీయ కుట్ర

సుమారు 10 ఇళ్లు కూలిపోయాయి..
పేలుడు కారణంగా 8 నుంచి 10 ఇళ్లు కూలిపోయాయి. అనేక భవనాల పైకప్పులు, గోడలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు ప్రకంపనలు చుట్టుపక్కల ప్రాంతంలోని పదికి పైగా భవనాలపై సంభవించిన నేపథ్యంలో పేలుడు తీవ్రతను అంచనా వేయవచ్చు. పేలుడు సంభవించిన వెంటనే అగ్నిమాపక దళానికి అత్యవసర కాల్ వచ్చింది. ఆ తర్వాత నిమిషాల్లో రెండు అగ్నిమాపక వాహనాలను ప్రమాదస్థలానికి పంపించారు. వెంటనే రక్షణ, సహాయ చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక, అత్యవసర సేవలు, స్థానిక పోలీసులు, NDRF బృందాలు శిథిలాల తొలగింపు ఆపరేషన్‌ను ప్రారంభించారు.

గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అగ్నిమాపక అధికారుల ప్రాథమిక దర్యాప్తులో సిలిండర్ లీక్ కావడం వల్ల పేలుడు సంభవించిందని తెలుస్తోంది. ఇంకా ఏమైనా ఇతర కారణాలను ఉన్నాయా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. “ప్రాథమిక దర్యాప్తులో సిలిండర్ పేలుడు జరిగిందని తేలింది. అయితే కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు జరుగుతోంది” అని అగ్నిమాపక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సారా ఫాతిమా, సీనియర్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

READ MORE: Revanth Reddy: మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం.. జర ఆలోచించండి!

Exit mobile version