NTV Telugu Site icon

Praja Sangrama Yatra Today End: బండిసంజయ్‌ పాదయాత్ర నేటితో ముగింపు.. బహిరంగ సభకు నడ్డా

Bandi Sanjay Jpnadda

Bandi Sanjay Jpnadda

Praja Sangrama Yatra Today End: తెలంగాణలో అధికారమే ధ్యేయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. గత నెల 28న నిర్మల్ జిల్లా భైంసాలో ప్రారంభమైన పాదయాత్ర 18 రోజుల పాటు ఐదు జిల్లాల్లో 222 కిలోమీటర్ల మేర సాగింది. ముథోల్, నిర్మల్, ఖానాపూర్, కోరుట్ల, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో పర్యటించిన అనంతరం ఐదో విడత ప్రజా పోరాట యాత్ర నేడు కరీంనగర్‌లో ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఎస్ ఆర్ ఆర్ కళాశాల మైదానంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది.

ముగింపు సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నేడు మధ్యాహ్నం 2.10 నిమిషాలకు నడ్డా హైదరాబాద్ చేరుకోనున్నారు. 2.50కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 3.30కి కరీంనగర్ చేరుకుంటారు. 3.40 కు పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి చేరుకుని..4.30 వరకు అక్కడే ఉంటారు. 4.45 నిమిషాలకు కరీంనగర్ నుంచి బయలుదేరి 5.25 కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. శంషాబాద్ నుంచి 5.35కు బయలుదేరి ఢిల్లీకి వెళ్లనున్నారు. మొదట జేపీ నడ్డా ఈ నెల 16న వస్తారని ప్రచారం జరిగినా..ఆ రోజు ఆయన హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించాల్సి ఉండడంతో బహిరంగ సభ షెడ్యూల్ ఈనెల 15 కు మారింది. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభను పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

Read also: Thurs Day Saibaba Chalisa Live: గురువారం సాయిచాలీసా వింటే అన్నీ శుభాలే!

ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు.ముఖ్యంగా రాష్ట్రంలోని పోలింగ్ బూత్ కమిటీ సభ్యులందరూ హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించారు. బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనన్న సంకేతాలు ఇవ్వాలని కమలదళం భావిస్తోంది. ఆరో విడత ప్రజాసంగ్రామ యాత్ర షెడ్యూల్‌ను బహిరంగ సభ వేదికపైనే ప్రకటించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.

ఇక కరీంనగర్ లోనే కేసీఆర్ గ్రాఫ్ భారీగా పెరిగింది. కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుకు పెద్దపీట వేసిన కరీంనగర్ లో సభను విజయవంతం చేసి బీఆర్ ఎస్ పని అయిపోయిందన్న సంకేతాలు పంపాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్, బీఆర్‌ఎస్ ఆవిర్భావంపై జేపీ నడ్డా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బహిరంగ సభకు భారీగా ప్రజలను సమీకరించాలని రాష్ట్ర నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Show comments