Bandaru Satyanarayana Murthy: మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.. దీనిపై సీరియస్ అయిన ఏపీ మహిళా కమిషన్.. బండారుపై కేసులు నమోదు చేయాలంటూ ఏపీ డీజీపీకి లేఖ రాయడం.. ఆ తర్వాత ఆయనపై కేసు.. అరెస్ట్, కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు రావడం అన్ని జరిగిపోయాయి. అయితే, తనకు బెయిల్ వచ్చాక తొలిసారి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు బండారు సత్యనారాయణ.. పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాపై పెట్టిన కేసులో అదృష్టం న్యాయదేవత రూపంలో నిలబడిందన్నారు. ఉరిశిక్ష కైనా సిద్ధం తప్ప దుర్మార్గపు చర్యలతో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మమ్మల్ని భయపెట్ట లేరన్నారు. ఉండే నాలుగు మాసాలైనా బుద్ధి మార్చుకుంటే మంచిదని సీఎం వైఎస్ జగన్‌కు సూచించారు.
Read Also: Maharashtra: నాందేడ్ ఘటన మరవక ముందే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్కరోజులో 23 మంది మృతి
ఇక, నా సంతకం ఫోర్జరీ జరిగితే నేను చెప్పాలి.. కానీ, హైకోర్టులో నా సంతకం ఫోర్జరీ అని ప్రభుత్వం చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు బండారు.. మహిళలంటే నాకెంతో గౌరవమన్న ఆయన.. గౌరవంతో బతికే కుటుంబాలపై మంత్రి ఆర్కే రోజా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు కాబట్టే ఆమెకు బుద్ధి చెప్పా అన్నారు. సాటి మహిళల్ని కూడా కించపరిచే మంత్రి రోజాపై నేను చేసిన వ్యాఖ్యలను ఎంతోమంది మహిళలు సమర్ధించారని చెప్పుకొచ్చారు. మంత్రి ఆర్కే రోజాపై నేను చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా విశ్లేషించుకోవాలని సూచించారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి .