హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితాలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసాయని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ను ఎదురుకునే సత్తాలేక బీజేపీ… కాంగ్రెస్ ను కలుపుకుందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పై ఈటెల రాజేందర్ ఒప్పుకున్నారని… ఢిల్లీలో శత్రువులు- రాష్ట్రంలో మిత్రులుగా పనిచేయడం సిగ్గుచేటని ఆగ్రహించారు.
RRR అంటే రాజాసింగ్- రఘునందన్ రావు- రేవంత్ రెడ్డి పేర్కొన్నారు బాల్క సుమన్. హుజురాబాద్ లో కేసీఆర్ సభ పెట్టకుండా ఎన్నికల సంఘం అడ్డుకుందని.. కేంద్రం చేతిలో ఎన్నికల సంఘం బందీ అయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికలకు ముందు ఈటెల- రేవంత్ ను కలిశారని… హిమాచల్ ప్రదేశ్- కర్ణాటక- దేశవ్యాప్తంగా బీజేపీ కి ప్రతికూల పరిస్థితులను ఎదురుకుందన్నారు. హుజురాబాద్ లో కమలం పువ్వు రాలిపోకుండా హస్తం అడ్డుకుందని…కాంగ్రెస్ పార్టీని ఈటలకు తాకట్టు పెట్టి బీజేపీని గెలిపించారని నిప్పులు చెరిగారు. ప్రాంతీయ పార్టీని నిలువరించేందుకు జాతీయ పార్టీలు ఒక్కటయ్యారని… హుజురాబాద్ లో మ్యానిఫెస్టో ఈటెల అమలు చేయాలని డిమాండ్ చేశారు.
