NTV Telugu Site icon

Bandamuri Balakrishna: ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసం.. ఫైర్‌ అయిన బాలయ్య

Ntr

Ntr

Bandamuri Balakrishna: బాపట్ల జిల్లా బర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు ఎన్టీఆర్‌ విగ్రహం తల పగులగొట్టి పరారయ్యారు. దీనిపై స్థానిక తెలుగుదేశం పార్టీ నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. అయితే, ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు.. బాపట్ల మండలం భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం బాధాకరమన్న ఆయన.. విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అర్ధరాత్రి సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం పిరికిపంద చర్యగా పేర్కొన్నారు.

ఇక, తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ విగ్రహంపై ఈ అమానుష ఘటన నన్ను తీవ్రంగా బాధించిందన్నారు బాలకృష్ణ.. అన్నగారిని అవమానించడమంటే తెలుగువారిని అవమానించడమేనన్న ఆయన.. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా మహనీయులను అవమానించే చర్యలు పరిపాటిగా మారాయి.. విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. మరోసారి విధ్వంసక ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు నందమూరి బాలకృష్ణ.

మరోవైపు.. న్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు చంద్రబాబు. మహనీయుల పట్ల అగౌరవంగా వ్యవహరించడం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అహంకారానికి నిదర్శనమన్నారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు బాబు.. ఇక, ఓటమి భయంతో వైసీపీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు నారా లోకేష్‌.. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ స్థానాన్ని వైసీపీ.. ఆయన విగ్రహాల కూల్చివేతతో చెరిపేయలేదని పేర్కొన్నారు నారా లోకేష్‌.