NTV Telugu Site icon

Balagam Mogilaiah: ‘బలగం’ మొగిలయ్య కన్నుమూత!

Balagam Mogilaiah

Balagam Mogilaiah

బలగం మూవీ ఫేమ్, జానపద కళాకారుడు మొగిలయ్య (67) కన్నుమూశారు. వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. బలగం సినిమాలో తన గాత్రంతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన మొగిలయ్య.. గత కొన్ని నెలలుగా కిడ్నీలు ఫేయిల్యూర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. మొగిలయ్య స్వగ్రామం వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకర్గంలోని దుగ్గొండి. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి, నటీనటులు సంతాపం తెలిపారు.

మొగిలయ్య వైద్య ఖర్చులు బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి, చిత్ర యూనిట్‌తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆర్థికసాయం చేశారు. రెండు కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడంతో మొగిలయ్య అనారోగ్యానికి గురయ్యారు. వారానికి రెండు సార్లు డయాలసిస్ చేస్తున్న క్రమంలో ఆయనకు గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు అసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారు జామున మరణించారు.

Also Read: Hyderabad Book Fair 2024: నేటి నుంచే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య , కొమురమ్మ దంపతులు బుర్ర కథలు చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వచ్చిన కళ బుర్రకథను చెప్పడమే వీళ్లకు జీవనాధారం. వరంగల్, మంచిర్యాల, గోధావరిఖని, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో బుర్రకథ చెబుతూ.. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. కాగా ఈ దంపతులు బలగం సినిమాలో క్లైమాక్స్ లో పాడిన పాట మంచి హిట్ అయ్యింది. దీంతో మొగిలయ్యకు ప్రత్యేక గుర్తింపు లభించింది.