ఏపీలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నిక ద్వారా వైసీపీ అభ్యర్థి డా.సుధ ఏకంగా సీఎం జగన్ రికార్డునే అధిగమించారు. బద్వేల్ ఉప ఎన్నికలో ఆమె రికార్డు మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల నుంచి పోటీ చేసిన జగన్ టీడీపీ అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డిపై 90,110 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన 1,80,127 ఓట్లలో జగన్మోహన్ రెడ్డికి 1,32,356 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో జగన్‌కు 75,243 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే 2019లో జగన్ నెలకొల్పిన మెజారిటీ రికార్డును బద్వేల్ వైసీపీ అభ్యర్థి డా.సుధ అధిగమించారు. ఆమె 90,533 ఓట్ల మెజారిటీతో జగన్ కంటే ఎక్కువ ఓట్లు సాధించి కనివినీ ఎరుగని రీతిలో విజయాన్ని తన బుట్టలో వేసుకున్నారు.
Read Also: శత్రువుకు శత్రువు మిత్రుడు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్య
కాగా బద్వేల్ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీ చేయలేదు. కేవలం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే పోటీ చేశాయి. టీడీపీ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ ఓట్లు కూడా వైసీపీకే పడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బద్వేల్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బద్వేల్‌లో తమ పార్టీ ప్రచార కార్యక్రమాలను ముందుండి నడిపించారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక తరహాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం వ్యూహాలు రచించి మరోసారి విజయవంతం అయ్యారు.