NTV Telugu Site icon

‘రాధే శ్యామ్’కు టైమ్ బ్యాడ్!

Bad time to Prabhas's Radhe Shyam

రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రం ఆశించిన స్థాయిలో అలరించకపోవడంతో అభిమానులంతా ‘రాధేశ్యామ్’ చిత్రం మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ పిరియాడికల్ మూవీ ‘రాధేశ్యామ్’లో విక్రమాదిత్యగా ప్రభాస్ నటిస్తుంటే… ఆయన జోడీగా ప్రేరణ పాత్రను పూజా హెగ్డే పోషిస్తోంది. అనుకున్న సమయానికి ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను నిర్మాతలు ఇవ్వకపోయినా పంటిబిగువన బాధను అదిమి పట్టి… జూలై 30న సినిమా వస్తుంది కదా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఇంతవరకూ ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వారి ఓపికకు మరింత పరీక్ష పెట్టే సమయం వచ్చేసింది. కేవలం పదిరోజులలో సినిమా షూటింగ్ అంతా అయిపోతుందనగా కరోనా సెకండ్ వేవ్ ఆ చిత్ర బృందాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేసింది. కొద్ది పాటి ప్యాచ్ వర్క్, ప్రభాస్, పూజా హెగ్గే పై గ్రీన్ మ్యాట్ లో సాంగ్, కృష్ణంరాజుకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ లో ఉంది. దాని కోసం సర్వసన్నాహాలు చేసుకున్నాక షెడ్యూల్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ప్రభాస్ పర్శనల్ మేకప్ మేన్ కు కరోనా రావడంతో ఆయన హోమ్ ఐసొలేషన్ కు వెళ్ళిపోయారు. ఆ తర్వాత పూజా హెగ్డే నూ కరోనా పలకరించింది. దీంతో ఇటు నిర్మాతలు, అటు అభిమానులు నీరసించి పోయారు. మళ్లీ ఓ మంచి రోజు చూసి షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత కానీ విడుదల విషయంలో ఓ క్లారిటీ రాదనేది స్పష్టమైపోయింది. కృష్ణంరాజు సమర్పణలో ప్రమోద్, వంశీ, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, హిందీలో టీ-సీరిస్ భూషణ్‌ కుమార్ విడుదల చేయబోతున్నారు. దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తుంటే, హిందీ వెర్షన్ కు మిథున్, మనన్ భరద్వాజ్ మ్యూజిక్ ఇస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు, సత్యరాజ్, జయరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.