Site icon NTV Telugu

Ayodhya Temple: రామమందిరాన్ని పేల్చేస్తామని ఫోన్‌కాల్‌ కలకలం.. పోలీసులు అలర్ట్

Ayodhya

Ayodhya

Ayodhya Temple: అయోధ్య రామమందిరాన్ని బాంబులతో కూల్చేస్తామని ఓ ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్‌ కాల్‌ కలకలం సృష్టించింది. ఫోన్‌ చేసిన ఆ వ్యక్తి ఆలయాన్ని పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ బెదిరింపు కాల్‌ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం ప్రయాగ్‌రాజ్‌కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తికి అయోధ్య రామమందిరాన్ని కూల్చేస్తామని బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మనోజ్ కుమార్ అయోధ్యలోని రాంలాలా సదన్ నివాసి కాగా.. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోని కల్పవస్‌లో ఉన్నాడు. అయితే, మనోజ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. కాల్‌లో మరికొన్ని గంటల్లో శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరించారు. దీంతో, భయాందోళనకు గురైన మనోజ్‌.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు కాల్ ట్రాకింగ్ ఆధారంగా గుర్తించే పనిలో ఉన్నారు. ఇక, బాంబు బెదిరింపు నేపథ్యంలో అయోధ్యలో పోలీసు బందోబస్తు పెంచినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Read Also:Telangana Assembly Budget Session Live: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు లైవ్ అప్ డేట్స్

మరోవైపు అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం గర్భగుడిలో కొలువుతీరే బాలరాముడి విగ్రహ తయారీకి వినియోగించే పవిత్ర సాలగ్రామ శిలలను నేపాల్‌ నుంచి తెప్పించారు. దాదాపు ఆరు కోట్ల సంవత్సరాల పురాతన శిలలుగా చెప్పబడే ఈ శిలలను నేపాల్‌లోని మస్తాంగ్‌ జిల్లాలోని ముక్తినాథ్‌కు సమీపంలో కాళీ గండకీ నదీ ప్రవాహప్రాంతం నుంచి సేకరించడం గమనార్హం. జానకీరాముల విగ్రహాలను చెక్కేందుకు 26 టన్నులు, 14 టన్నులు బరువైన ఈ రెండు శిలలను రోడ్డు మార్గంలో బుధవారం రాత్రి అయోధ్యకు తీసుకుని వచ్చారు. 51 మంది వైదికుల వేదమంత్రోచ్ఛారణల నడుమ శిలలను ఆలయానికి సంబంధించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేశారు. ఈ సందర్భంగా కరసేవక్‌పురంలో గురువారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Exit mobile version