Site icon NTV Telugu

Delhi Capitals Captain: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్‌!

Axar Patel Delhi Capitals Captain

Axar Patel Delhi Capitals Captain

అందరూ ఊహించిందే నిజమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఎంపికయ్యాడు. అక్షర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఢిల్లీ క్యాపిటల్స్ తన ఎక్స్ ద్వారా తెలిపింది. ‘ఈరోజు కొత్త శకం ప్రారంభమంది’ అని పేర్కొంది. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్‌ రాహుల్‌ జట్టులో ఉన్నా.. సారథ్యం తీసుకొనేందుకు అతడు మొగ్గు చూపలేదు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్‌.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీపై అక్షర్‌ పటేల్‌ స్పందించాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఎంపికవడం చాలా గౌరవంగా ఉంది. నాపై నమ్మకం ఉంచిన ప్రాంచైజీ యాజమాన్యం, సహాయక సిబ్బందికి నేను చాలా కృతజ్ఞుడను. ఢిల్లీ జట్టులో నేను క్రికెటర్‌గా, మంచి మనిషిగా ఎదిగాను. ఢిల్లీ జట్టును ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను. మా కోచ్‌లు మెగా వేలంలో మంచి ఆటగాళ్లను తీసుకున్నారు. సమతుల్య, బలమైన జట్టును తయారు చేశారు. ఢిల్లీ జట్టులో చాలా మంది నాయకులు ఉన్నారు. అది నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జట్టులో చేరడానికి ఆతృతగా ఉన్నాను’ అని అక్షర్‌ తెలిపాడు.

అంతర్జాతీయ క్రికెట్ సహా ఐపీఎల్‌లో అక్షర్‌ పటేల్‌ ఇప్పటివరకు కెప్టెన్సీ చేయని విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున చాల ఏళ్లుగా ఆడుతున్నాడు. ఢిల్లీకి ఏడో సీజన్‌ ఆడబోతున్న అక్షర్‌.. 150 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 123 వికెట్లు, 1653 పరుగులు చేశాడు. అక్షర్‌పై నమ్మకంతో ఢిల్లీ యాజమాన్యం అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇటీవలి రోజుల్లో అక్షర్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలవడంలో అక్షర్‌ పాత్ర కూడా ఉంది. ఐపీఎల్‌ 2025లో రూ.16.50 కోట్లకు అక్షర్‌ను ఢిల్లీ సొంతం చేసుకుంది. కెప్టెన్, బౌలర్, బ్యాటర్‌గా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్దమయ్యాడు.

Exit mobile version