NTV Telugu Site icon

Australian Open 2025: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తెలుగు కుర్రాడు.. అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడితో ఢీ!

Nishesh Basavareddy

Nishesh Basavareddy

టెన్నిస్ క్యాలెండర్‌లోని మొదటి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ 2025 షెడ్యూల్‌ గురువారం విడులైంది. జనవరి 12 నుంచి 26 వరకు టోర్నీ సాగనుంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తెలుగు మూలాలున్న అమెరికా కుర్రాడు నిశేష్‌ బసవారెడ్డి బరిలోకి దిగుతున్నాడు. గ్రాండ్‌స్లామ్‌ అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌తో పోటీపడబోతున్నాడు. 19 ఏళ్ల నిశేష్‌ వైల్డ్‌ కార్డుతో గ్రాండ్‌స్లామ్‌ అరంగేట్రం చేయనున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను రికార్డు స్థాయిలో 10 సార్లు గెల్చుకున్న జొకో ముందు బసవారెడ్డి ఎలా నిలబడనున్నాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిశేష్‌ బసవారెడ్డి తల్లిదండ్రులు మురళీకృష్ణ, సాయిప్రసన్నలది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా. 1999లో మురళీకృష్ణ అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలో జన్మించిన నిశేష్‌కు టెన్నిస్‌ అంటే చిన్నప్ప్పటి నుంచి ఇష్టం. తల్లిదండ్రులు కూడా అతడిని ప్రోత్సహించారు. అమెరికా స్టార్‌ ఆటగాడు రాజీవ్‌ రామ్‌, కోచ్‌ బ్రయాన్‌ స్మిత్‌ మార్గనిర్దేశనంలో నిశేష్‌ ఆటపై మంచి పట్టు సాధించాడు. సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లోనూ నిశేష్‌ సత్తా చాటుతున్నాడు. 2022లో ఒజాన్‌ బారిస్‌తో కలిసి యుఎస్‌ ఓపెన్‌ బాలుర డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు.

నిశేష్‌ బసవారెడ్డి 2024 యుఎస్‌ ఓపెన్లో క్వాలిఫయింగ్‌ టోర్నీ ఆడి.. మూడో రౌండ్‌ వరకు చేరుకున్నాడు. ఈ ఏడాదే సీనియర్‌ సర్క్యూట్‌లోకి వచ్చిన నిశేష్‌కు ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో మెయిన్‌డ్రా ఆడేందుకు వైల్డ్‌కార్డ్‌ దక్కింది. ప్రస్తుతం సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో 133వ స్థానంలో ఉన్నాడు. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ 2025లో రాణిస్తే మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మొదటి మ్యాచులోనే నొవాక్‌ జకోవిచ్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. నిశేష్‌కు తెలుగు బాగా అర్థం అవుతుంది కానీ.. మాట్లాడడం కొద్దిగా మాత్రమే వచ్చు. ఈ విషయాన్ని అతడు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Show comments