స్వదేశంలో టీమిండియాను టెస్టుల్లో ఓడించడం అంత తేలికైన విషయం కాదు. పదేళ్లుగా ఇక్కడ భారత జట్టుకు అసలు ఓటమే లేదు. అలాంటి టీమిండియాను 19 ఏళ్ల తర్వాత సొంతగడ్డపైనే ఓడించేందుకు ఆస్ట్రేలియా టీమ్ వ్గూహాలు రచిస్తోంది. అయితే ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం ఆ టీమ్ ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకపోవడం ఆశ్చర్యం కలిగించింది. కానీ ఈ టూర్ మ్యాచ్ వల్ల లాభం లేదని, కావాలని తమకు పేస్ పిచ్‌లు తయారు చేయించి ప్రాక్టీస్ గేమ్స్ ఆడిస్తున్నారని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పాడు. అందుకే తమ సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటామనీ అన్నాడు. అయితే దీని వెనుక ఆస్ట్రేలియా ఓ పెద్ద మాస్టర్ ప్లానే వేసినట్లు తాజాగా తేలింది. ఆ ప్లాన్‌కు ఐపీఎల్ టీమ్ ఆర్సీబీ టీమ్ సాయం చేస్తోంది.
ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే!
ఫిబ్రవరి 9న తొలి టెస్ట్ నాగ్‌పూర్‌లో జరగనుండగా ఆస్ట్రేలియా మాత్రం నాలుగు రోజుల సన్నాహక క్యాంప్‌ను బెంగళూరులో ఏర్పాటు చేసుకుంది. దీనికి కారణం ఆ టీమ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్, స్పిన్ కన్సల్టెంట్ డానియల్ వెటోరీ. ఈ ఇద్దరికీ ఐపీఎల్ టీమ్ ఆర్సీబీతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో బెంగళూరు దగ్గరలోని ఆలూర్‌లో ఆస్ట్రేలియా ప్రత్యేకంగా తమకు కావాల్సినట్లుగా స్పిన్ పిచ్‌లను ఏర్పాటు చేయించుకొని మరీ ప్రాక్టీస్ చేస్తోంది. ఇండియన్ టీమ్ లోని అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ లాంటి స్పిన్నర్లు.. షమీ, సిరాజ్‌లాంటి పేసర్లను ఎదుర్కోవడానికి తగిన పిచ్‌లపై ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించింది. వీటిలో కాస్త తక్కువ స్పిన్ అయ్యే పిచ్‌లు, బాగా టర్న్ అయ్యే పిచ్‌లు, వేరియబుల్ బౌన్స్ ఉండే పిచ్‌లు ఉన్నాయి. నాగ్‌పూర్, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో స్పిన్ పిచ్‌లే ఎదురవుతాయని ఆస్ట్రేలియా ఇలాంటి పిచ్‌లపై ప్రాక్టీస్ చేస్తోంది.
Shocking Incident : ఛీ వీళ్లు పేరెంట్సా.. బిడ్డకు విమాన టిక్కెట్ కొనాల్సి వస్తుందని..
ఇక ధర్మశాల పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలం. అందుకు తగినట్లు ప్రత్యేకంగా మరో పచ్చిక ఉన్న పిచ్ కూడా ఏర్పాటు చేసుకుంది ఆసీస్ టీమ్. నాలుగు రోజుల పాటు తమ బ్యాటర్లు ఈ వేర్వేరు పిచ్‌లపై పూర్తిస్థాయిలో సిరీస్ కోసం సిద్ధమయ్యేలా చేయాలన్నది ఆస్ట్రేలియా ప్లాన్. ఇక మీడియా, అభిమానుల కంటపడకుండా దూరంగా ఆలూర్‌లో ఈ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం విశేషం. గతంలో 2013, 2017లలో ప్రాక్టీస్ గేమ్స్ ఆడిన ఆస్ట్రేలియా.. సిరీస్‌లో ఎదురయ్యే పిచ్‌లకు, ఈ ప్రాక్టీస్ మ్యాచ్ పిచ్‌లకు అసలు సంబంధం లేని విషయాన్ని గమనించింది. దీంతో ఈసారి కావాలనే వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇండియా అంటేనే స్పిన్‌కు స్వర్గధామం. ఎలాగూ అలాంటి పిచ్‌లపైనే ఆడాల్సి వస్తుందని ఊహించిన ఆసీస్.. ఈ కొత్త ఎత్తుగడ వేసింది. గురువారం (ఫిబ్రవరి 2) నుంచే ఆ టీమ్ నాలుగు రోజుల ప్రాక్టీస్ ప్రారంభిస్తోంది.