Matthew Wade Retirement: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు ఫార్మాట్‌కు తాను వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం తాను కొనసాగుతానని వేడ్ స్పష్టం చేశాడు. ది షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో టాస్మానియా- వెస్టర్న్ ఆస్ట్రేలియా మధ్య మార్చి 21న మొదలుకానున్న ఫైనల్ మ్యాచ్ తన రెడ్ బాల్ క్రికెట్‌లో ఆఖరిదని తెలిపాడు. టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వేడ్.. జూన్ 1 నుంచి ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్ 2024పై దృష్టి సారించాడు.
మాథ్యూ వేడ్ 2012లో ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టాడు. వికెట్ కీపర్, బ్యాటర్‌గా జట్టుకు సేవలు అందించాడు. అయితే ఫామ్ కోల్పోవడం, అదేసమయంలో అలెక్స్ క్యారీ రాణించడంతో వేడ్‌కు అవకాశాలు లేకుండా పోయాయి. 2021లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కెరీర్‌లో మొత్తంగా 36 టెస్టులు ఆడిన వేడ్.. 1613 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 117. 36 ఏళ్ల వేడ్ ఆసీస్ తరఫున ఇప్పటివరకు 97 వన్డేలు, 85 టీ20లు ఆడాడు.
Also Read: IPL 2024: కేకేఆర్‌కు అతడే కీలక ప్లేయర్.. ఏమాత్రం ఒత్తిడి గురికాడు: గౌతమ్ గంభీర్
‘టెస్టు ఫార్మాట్ గేమ్ అందించే సవాళ్లను నేను పూర్తిగా ఆస్వాదించాను. నేను వైట్ బాల్ క్రికెట్ ఆడటం కొనసాగిస్తాను. నా దేశం కోసం ఆడుతున్నప్పుడు బ్యాగీ గ్రీన్ ధరించడం నా కెరీర్‌లో ఎప్పటికైనా హైలైట్‌గా నిలుస్తుంది. టీ20 జట్టులో కొనసాగడానికి ఇది ఉత్తమ సమయం. నేను టీ20 ప్రపంచకప్ 2024లో ఆడడానికి వేచి చూస్తున్నా’ అని మాథ్యూ వేడ్ పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్లో మంచి ఫినిషర్‌గా వేడ్ గుర్తింపు పొందాడు. టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో ఆస్ట్రేలియా టైటిల్ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో 17 బంతుల్లోనే 41 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.