Site icon NTV Telugu

IND vs AUS 3rd Test: భారత్‌పై ఆసీస్‌ విజయం.. 2-1 ఆధిక్యంలో టీమిండియా

Sports News

Sports News

IND vs AUS 3rd Test: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో ఆసీస్ జట్టు మూడో టెస్టులో భారత్‌పై ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. హ్యాట్రిక్‌ నమోదు చేయాలని భావించిన టీమిండియాకు ఓటమి తప్పలేదు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఆసీస్‌ తొలి విజయం సాధించడంతో టీమిండియాకు ఆఖరి టెస్టులో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంతో టీమిండియా ముందంజలో ఉంది. ఇండోర్‌ వేదికగా బుధవారం మొదలైన మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా స్పిన్నర్లు విజృంభించడంతో టీమిండియా మొదటి రోజే కేవలం 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. విరాట్‌ కోహ్లి 22, శుభ్‌మన్‌ గిల్‌ 21 పరుగులు చేయగా మిగతా వాళ్లంతా కనీసం 20 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. 109 పరుగులకే భారత్‌ ఆలౌట్‌ కాగా.. ఆసీస్‌ బ్యాటింగ్‌కు దిగింది.

Read Also: Credit Card Fraud: హైటెక్‌ మోసం.. ధోనీ, అభిషేక్‌ బచ్చన్‌ సహా ప్రముఖుల పాన్‌ వివరాలతో..

ఈ నేపథ్యంలో భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆసీస్‌ నడ్డి విరుస్తారని భావించిన సగటు అభిమానులకు నిరాశే ఎదురైంది. జడేజా 4, అశ్విన్‌ 3, పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ 3 వికెట్లు తీసినప్పటికీ ఆస్ట్రేలియా 88 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్‌ ఖవాజా 60 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఇదిలా ఉండగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగింది. ఛతేశ్వర్ పుజారా ఒక్కడే అర్థశతకం చేయగా.. శ్రేయస్ అయ్యర్ 26 పరుగులతో కాస్త రాణించగలిగాడు. మూడో రోజు ఆట మొదలుకాగానే అశ్విన్ ఖవాజాను ఔట్ చేసినప్పటికీ ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ 49 పరుగులతో అదరగొట్టగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ 28 పరుగులు చేశాడు.

Exit mobile version