NTV Telugu Site icon

Paris Olympics 2024: 58 ఏళ్ల వయసులో ఒలింపిక్స్‌లో అరంగేట్రం.. కల నెరవేర్చుకున్న బామ్మ!

Olympics

Olympics

Paris Olympics 2024: చాలావరకు ఎవరైనా పెద్ద వయస్సు వచ్చాకా.. కలలు కనడం మానేస్తారు. వాటిని నెరవేర్చుకోవడం గురించి ఆలోచించడమే మానేస్తారు. ఎవరైనా వయస్సు అయిపోయిన వృద్ధులు పని చేస్తుంటే.. ఇంకా ఈ వయస్సులో ఎందుకు ఆ తంటాలు అని తరచుగా మనం వింటుంటాం. కానీ కలలను నెరవేర్చుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించింది జియింగ్ జెంగ్. ఆమె ఎవరో కాదు చిలీ తరపున ఆడిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి జియింగ్ జెంగ్. ఆమె తన 58 ఏళ్ల వయస్సులో పారిస్‌ ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసింది. అతిపెద్ద వయస్సులో అరంగేట్రం చేసిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. గెలుపు ఓటమిని పక్కన పెడితే ఆ వయస్సులో ఇతర ఆటగాళ్లతో సమానంగా ఆడడం గ్రేట్ అనే చెప్పాలి. పరిస్థితులు ఏమైనా మీ కలలను సాధించకుండా ఆపలేపని ప్రపంచానికి రుజువు చేసింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతిపెద్ద వయస్సు ఉన్న మహిళగా రికార్డు నెలకొల్పింది.

Read Also: IND vs SL: భారత్ ముందు స్వల్ప లక్ష్యం.. శ్రీలంక స్కోరు..?

ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్న తన చిరకాల కోరికను జియింగ్ జెంగ్ ఆలస్యంగా సాకారం చేసుకుంది. చైనాలో జన్మించిన జియింగ్ జెంగ్ ప్రస్తుతం చిలీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమెకు అంత సులువుగా ఆ అవకాశం దక్కలేదు మరీ. దక్షిణ చైనాలోని ఫోషన్‌లో జన్మించిన జియింగ్ జెంగ్.. స్థానిక టేబుల్ టెన్నిస్ కుమార్తె. చిన్నతనంలో, ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ శిక్షణా సమావేశాలకు ఆమె తల్లితో పాటే వెళుతూ ఆ ఆట మీద ప్రేమను పెంచుకుంది. 18 ఏళ్ల వయసులో సొంత దేశమైన చైనా తరపున ఆడాలని తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఒలింపిక్స్‌ అరంగేట్రానికి ముందే ఆమె తనకెంతో ఇష్టమైన ఆటకు దూరమైంది.

రెండేళ్ల తర్వాత 20 ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించింది. అనంతరం 20 ఏళ్ల పాటు ఫర్నిచర్ షాప్ నడిపింది. ఆ తర్వాత చిలీలో వివిధ టేబుల్ టెన్నిస్ జట్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. కొవిడ్ సమయంలో ఆమె తిరిగి టేబుల్ టెన్నిస్ ఆడడం ప్రారంభించింది. కరోనా కాలంలో, జియింగ్ జెంగ్ టేబుల్ టెన్నిస్ ఆడటానికి బానిస అయ్యారు. ఆమెకు మ్యాచ్ ఆడాలనిపించింది. ఆమెకు కుటుంబం కూడా సహకరించింది. ఆమె చిలీలోని ఇక్విక్‌లో ఫెడరేషన్ సహాయంతో ప్రాంతీయ టోర్నమెంట్‌లలో ఆడటం ప్రారంభించారు. స్నేహితులు, కుటుంబ సభ్యులను ఒప్పించిన తర్వాత, 57 ఏళ్ల వయస్సులో 2023 సౌత్ అమెరికన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌కు కూడా అర్హత సాధించారు. 2023 శాంటియాగోలో జరిగిన పాన్ అమెరికన్ గేమ్స్‌లో జియింగ్ జెంగ్ చిలీ యొక్క సంచలన తారగా అవతరించింది. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాన్ని సంపాదించింది. మొత్తానికి 2024లో పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆడి తన కలను నెరవేర్చుకుంది.