Gold Medal In Glasgow: కామన్వెల్త్ గేమ్స్‌లో దూసుకుపోతున్న భారత్.. మరో రెండు స్వర్ణాలు సొంతం..

Dey

Dey

గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్‌వెల్త్ గేమ్స్ (2026)లో భారత జూడో క్రీడాకారిణి అస్మితా దే కొత్త చరిత్ర సృష్టించారు. మహిళల 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి, కామన్‌వెల్త్ గేమ్స్ జూడో పోటీలలో భారత్‌కు మొట్టమొదటి గోల్డ్ మెడల్ అందించిన క్రీడాకారిణిగా నిలిచారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో అస్మితా కెనడాకు చెందిన హెయిడీ క్వాచ్‌ను ఓడించారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంతో జాగ్రత్తగా ఆడారు. ఒక దశలో కెనడా క్రీడాకారిణి ‘యూకో’ పాయింట్‌తో ఆధిక్యం సాధించినప్పటికీ, అస్మితా వెంటనే పుంజుకుని ప్రతిగా ‘యూకో’ పాయింట్ సాధించి 1-1తో సమానం చేశారు.

నిర్ణీత సమయంలో ఇరు ప్రతినిధులు సమవుజ్జీలుగా నిలవడంతో మ్యాచ్ ‘గోల్డెన్ స్కోర్’ (సడన్ డెత్) కు దారితీసింది. ఒత్తిడిని జయించిన అస్మితా, సరైన సమయానికి అత్యంత ప్రతిభావంతమైన ‘యూకో’ పాయింట్‌ను సాధించి భారత్ కలల స్వర్ణాన్ని ఖాయం చేశారు. ఈ గెలుపుతో కామన్‌వెల్త్ గేమ్స్ జూడో చరిత్రలో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా అస్మిత నిలిచారు. ఆమె చూపిన ప్రతిభ, ఆత్మవిశ్వాసం దేశానికి గర్వకారణంగా మారాయి. అంతే కాకుండా.. 60 కిలోల పురుషుల జూడో విభాగంలో హర్షసింగ్ కూడా స్వర్ణం సాధించారు. దీంతో పతకాల సంఖ్య 19కి చేరింది.

ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల విషయానికి వస్తే.. స్వర్ణ పతకాల్లో.. అస్మితా డే (జూడో), మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), షర్మిల ధాన్‌కర్ (పారా అథ్లెటిక్స్), దిలీప్ మహదు గావిత్ (పారా అథ్లెటిక్స్), హర్షసింగ్(జూడో).

రజత పతకాల విషయానికి వస్తే.. రిషికాంత సింగ్, ముత్తుపాండి రాజా, జ్ఞానేశ్వరి యాదవ్, హర్‌జిందర్ కౌర్, లవ్‌ప్రీత్ సింగ్ (వెయిట్‌లిఫ్టింగ్), సర్వేష్ కుషారే, గుల్వీర్ సింగ్, ఎం. శ్రీశంకర్ (అథ్లెటిక్స్).

కాంస్య పతకాల విషయానికి వస్తే.. సీమా కలిరామ్నా, బింద్యారాణి దేవి, శిల్ప కె. షైలా, ఝండూ కుమార్ సాధించారు. ప్రస్తుతం ఇండియా 5 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలతో మొత్తం 19 పతకాలు సాధించి 8వ స్థానంలో నిలిచింది.