NTV Telugu Site icon

Asian Games 2023: ముగిసిన ఆసియా క్రీడలు.. స్వర్ణాల్లో ‘డబుల్‌ సెంచరీ’ కొట్టిన చైనా! నాలుగో స్థానంలో భారత్

India Wins 107 Medals

India Wins 107 Medals

Asian Games 2023 Closing Ceremony: 16 రోజులుగా క్రీడాభిమానులను అలరించిన ఆసియా క్రీడలు 2023 ఆదివారంతో ముగిశాయి. సెప్టెంబర్ 23న చైనాలోని హాంగ్‌జౌ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన 19వ ఆసియా క్రీడలు.. అక్టోబర్‌ 8న ఘనంగా ముగిశాయి. 80 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన బిగ్‌ లోటస్‌ స్టేడియంలో 75 నిమిషాల పాటు ముగింపు వేడుకలు జరిగాయి. 45 దేశాలకు చెందిన క్రీడాకారులు మైదానంలోకి రాగా.. చైనా సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రీడలు, సంస్కృతి సంబరాలుగా ముగింపు వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో భారత పతాకధారిగా పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ వ్యవహరించారు.

ఆసియా క్రీడల్లో 45 దేశాల నుంచి 12,407 మంది అథ్లెట్లు 40 క్రీడల్లో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఆసియా క్రీడలు ముగిసినట్లు ఆసియా ఒలింపిక్‌ మండలి (ఓసీఏ) తాత్కాలిక అధ్యక్షుడు రణ్‌ధీర్‌ సింగ్‌ అధికారికంగా ప్రకటించాడు. సంప్రదాయం ప్రకారం.. మొట్టమొదటి ఆసియా క్రీడల జ్యోతి, పతాకం, ఓసీఏ జెండాను నాగోయా ఐచి (జపాన్‌) నగర గవర్నర్‌ అందుకున్నారు. 2026 క్రీడలకు నాగోయా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

ఈసారి ఆసియా క్రీడల్లో చైనా ఏకంగా 383 పతకాలు సాధించింది. ఇందులో 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలు ఉన్నాయి. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారి పసిడి పతకాల్లో 200 మైలురాయిని చైనా దాటింది. 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో చైనా అత్యధికంగా 199 స్వర్ణ పతకాలు నెగ్గింది. వరుసగా తొమ్మిదోసారి ఆసియా క్రీడల్లో చైనా 100 అంతకంటే ఎక్కువ స్వర్ణ పతకాలు గెలిచింది. 1990 బీజింగ్‌ ఆసియా క్రీడల్లో చైనా స్వర్ణాల్లో మొదటిసారి ‘సెంచరీ’ కొట్టింది. అంతేకాదు వరుసగా పదకొండోసారి ఆసియా క్రీడల పతకాల పట్టికలో చైనా ‘టాప్‌’ ర్యాంక్‌ కొట్టింది.

Also Read: Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Asian Games 2023 Final Medals Tally: ఆసియా క్రీడల్లో జపాన్‌ 188 (52 స్వర్ణాలు, 67 రజతాలు, 69 కాంస్యాలు) పతకాలు సాధించి రెండో స్థానంలో ఉండగా.. 190 పతకాలతో (42 స్వర్ణాలు, 59 రజతాలు, 89 కాంస్యాలు) దక్షిణ కొరియా మూడో స్థానంలో ఉంది. 107 పతకాలతో (28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు) భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో మొత్తం 45 దేశాలు పాల్గొనగా.. 41 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. భూటాన్, ఈస్ట్‌ తిమోర్, మాల్దీవులు, యెమెన్‌ దేశాలు మాత్రం ఒక్క పతకం కూడా గెలవలేదు.