Ashish Nehra reacts on Hardik Pandya’s T20 Captaincy Snub: హార్దిక్ పాండ్యాను టీ20ల్లో కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ భారత జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం తనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. క్రికెట్‌లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని, నయా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఆలోచనా విధానాన్ని తాను అర్థం చేసుకున్నానని చెప్పాడు. హార్దిక్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చాలా ముఖ్యమైన ఆటగాడని, అదనపు ఫాస్ట్ బౌలర్‌గా ఉపయోగపడతాడని నెహ్రా చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ వీడ్కోలు అనంతరం హార్దిక్‌కు కాకుండా.. సూర్యకుమార్ యాదవ్‌కు సారథ్య బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే.
టీ20 కెప్టెన్సీపై తాజాగా ఆశిష్ నెహ్రా స్పందించాడు. ‘హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. క్రికెట్‌లో ఇలాంటివి జరగడం సహజమే. హార్దిక్ టీ20 ప్రపంచకప్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. ప్రతి కోచ్, కెప్టెన్‌కి భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. గంభీర్ ఆలోచనలు కూడా బిన్నంగా ఉంటాయి. కెప్టెన్సీపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, గంభీర్ కలిసి హార్దిక్‌తో మాట్లాడారనుకుంటున్నా. అలా మాట్లాడడం చాలా మంచిది. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ అనుభవం ఉంది. అతడు రాణిస్తాడని నమ్మకంగా ఉన్నా’ అని అన్నాడు.
Also Raad: Mohammed Shami Suicide: 19వ అంతస్తు నుంచి దూకి.. షమీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు!
‘హార్దిక్ పాండ్యా టీ20లు ఎక్కువగా, వన్డేలు తక్కువగా ఆడుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు చాలా ముఖ్యమైన ప్లేయర్. హార్దిక్ జట్టులో ఉంటే అదనపు ఫాస్ట్ బౌలర్‌గా ఉపయోగపడతాడు. అతడు జట్టుకు సమతూకం తీసుకొస్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ లేడనే విషయాన్ని గుర్తించుకోవాలి. హార్దిక్ విషయంలోనే కాదు మ్యాచ్‌లు ఎక్కువగా ఉన్నప్పుడు జట్టులో మార్పులు జరుగుతాయి. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా కెప్టెన్‌లుగా పనిచేశారని గుర్తుంచుకోవాలి’ అని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు. గుజరాత్ టైటాన్స్‌కు నెహ్రా హెడ్ కోచ్‌గా ఉన్నాడు. వచ్చే సీజన్ లోగా టైటాన్స్‌తో అతడు తెగదెంపులు చేసుబోతున్నాడని సమాచారం.