Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?

Aryavir Sehwag

Aryavir Sehwag

Aryavir Sehwag: భారత క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రత్యర్థి బౌలర్ ఎవరే నిర్ణయంతో సంబంధం లేకుండా, తొలి బంతి నుంచే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే ఆయన భయంలేని బ్యాటింగ్ శైలి కోట్ల మంది అభిమానులను అలరించింది. 1999లో పాకిస్థాన్‌పై వన్డే అరంగేట్రం చేసిన సెహ్వాగ్, తన కెరీర్‌లో మొత్తం 374 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి అన్ని ఫార్మాట్లలో కలిపి 17,253 పరుగులు సాధించారు. ఇందులో 72 అర్ధశతకాలు, 38 అంతర్జాతీయ శతకాలు ఉన్నాయి. తన ట్రేడ్‌మార్క్ షాట్లు, విధ్వంసకర శైలితో ఎన్నో మ్యాచ్‌లను భారత్‌కు ఒంటిచేత్తో అందించిన ఈ డాషింగ్ ఓపెనర్ సుదీర్ఘ కాలం పాటు క్రికెట్ రంగాన్ని ఏలాడు. ఇప్పుడు సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ఆ ఘనమైన లెగసీని ఆయన కుమారుడు ఆర్యావీర్ సెహ్వాగ్ ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున ఆడుతున్న ఆర్యావీర్, మైదానంలో పక్కా తన తండ్రి రూపాన్ని, బ్యాటింగ్ శైలిని గుర్తుచేస్తూ అభిమానులను మురిపిస్తున్నాడు. సెహ్వాగ్ ఐకానిక్ షాట్లయిన స్క్వేర్ డ్రైవ్, కవర్ డ్రైవ్‌లను ఆర్యావీర్ అచ్చు గుద్దినట్లు రీక్రియేట్ చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. తండ్రీకొడుకుల బ్యాటింగ్ టెక్నిక్‌లు ఎంత ఒకేలా ఉన్నాయో చూపిస్తూ DPL సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోలిక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, శనివారం సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్యావీర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్ట్ ఢిల్లీ లయన్స్ 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఓపెనర్ సిద్ధార్థ్ జూన్ కేవలం 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 33 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, సమర్థ్ సేథ్ మరింత దూకుడుగా ఆడి 14 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. టాప్, మిడిల్ ఆర్డర్ లయబద్ధంగా రాణించడంతో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 232/8 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 233 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ ఢిల్లీ లయన్స్ ఆరంభంలోనే విరుచుకుపడింది. కేవలం 4.5 ఓవర్లలోనే 71/2 స్కోరుతో దూసుకెళ్లింది. అయితే ఈ దశలో ఆర్యావీర్ సెహ్వాగ్ వికెట్ కోల్పోవడంతో లయన్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ తర్వాత క్రిష్ యాదవ్ (26 బంతుల్లో 46 పరుగులు – 7 ఫోర్లు, 1 సిక్సర్), అంకిత్ కుమార్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు విలువైన 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను గెలిపించే దిశగా తీసుకెళ్లారు. అయితే ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో తేజస్ బరోకా దెబ్బకొట్టాడు. క్రిష్ యాదవ్‌ను అవుట్ చేసి ఈ కీలక భాగస్వామ్యానికి తెరదించాడు. క్రిష్ నిష్క్రమించినా అంకిత్ కుమార్ ఏమాత్రం తగ్గకుండా సెంట్రల్ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసకరమైన 61 పరుగులు చేసి ఢిల్లీ లయన్స్‌ను రేసులో ఉంచాడు. కానీ అంకిత్ కుమార్ అవుట్ కావడంతో వెస్ట్ ఢిల్లీ లయన్స్‌పై ఒత్తిడి పెరిగింది. చివరి ఓవర్లలో రన్ రేట్ బాగా పెరిగిపోవడం, వరుసగా వికెట్లు పడటంతో లయన్స్ లక్ష్యానికి చేరువగా వచ్చి ఆగాల్సి వచ్చింది. ఆఖరికి 20 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగులు మాత్రమే చేసి, 21 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.