క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు వరల్డ్ వైడ్ గా అంతా రెడీ అవుతున్నారు. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ పండగ రానున్న వేళ సందడి వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో క్లీన్-షేవ్ చేసుకున్న యేసు అరుదైన పెయింటింగ్‌ను కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. టర్కీలోని ఇజ్నిక్ (పురాతన నైసియా) ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు ఒక అరుదైన ఫ్రెస్కోను కనుగొన్నారు. ఇది 3వ శతాబ్దానికి చెందిన భూగర్భ సమాధిలో ఉంది. ఈ చిత్రంలో యేసును “గుడ్ షెపర్డ్” (మంచి కాపరి)గా చూపించారు. ఆయన యువకుడిగా, గడ్డం లేకుండా, రోమన్ టోగా ధరించి, భుజంపై గొర్రెపిల్లను మోస్తూ ఉన్నారు.
ఆగస్టు నెలలో హిసార్డెరే నెక్రోపాలిస్‌లోని భూగర్భ సమాధిలో గుర్తించారు. ఇజ్నిక్ మ్యూజియం ఆర్కియాలజిస్ట్ ఎరెన్ ఎర్టెన్ ఎర్టెమ్ మాట్లాడుతూ, ఈ ఫ్రెస్కోలు లేట్ పాగనిజం నుంచి ప్రారంభ క్రైస్తవ మతానికి మార్పు చెందుతున్న సమయాన్ని చూపిస్తాయని తెలిపారు. సమాధి గోడలు, పైకప్పు పక్షులు, మొక్కలు, గొర్రెలు వంటి మోటిఫ్‌లతో అలంకరించబడి ఉన్నాయి. ఇక్కడ నోబుల్ పురుషులు, మహిళలు, దాసుల చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఆవిష్కరణకు మరింత ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఇది 3వ శతాబ్దంలో క్రైస్తవులు రోమన్ సామ్రాజ్యంలో హింసకు గురవుతున్న సమయంలో జరిగింది. ఆ కాలంలో క్రూస్ (సిలువ) సంకేతం బదులు “గుడ్ షెపర్డ్” మోటిఫ్ రక్షణ, మోక్షం, దైవిక మార్గదర్శనాన్ని సూచించేదని తెలిపారు.
Also Read:Matheesha Pathirana IPL Price: పోటీపడ్డ ఢిల్లీ, లక్నో, కోల్‌కతా.. మతీశాకు మతిపోయే ధర!
లీడ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ గుల్సెన్ కుట్బే మాట్లాడుతూ, ఈ ఫ్రెస్కో అనటోలియాలో ఇలాంటి రకమైన ఏకైక ఉదాహరణ కావచ్చని చెప్పారు. ఈ ఆవిష్కరణ ఇజ్నిక్ చరిత్రకు మరింత విలువను జోడిస్తుంది. ఇక్కడ A.D. 325లో నైసియా కౌన్సిల్ జరిగి, నైసియన్ క్రీడ్ రూపొందింది. గత నెలలో పోప్ లియో XIV ఇజ్నిక్‌ను సందర్శించారు. ఆ సమయంలో టర్కీ అధ్యక్షుడు రెజెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఈ ఫ్రెస్కో టైల్ పెయింటింగ్‌ను పోప్‌కు అందజేశారు. ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ఇది ప్రారంభ క్రైస్తవ కళలో రోమన్ ప్రభావాన్ని, యేసు చిత్రణలో వైవిధ్యాన్ని బయటపెడుతుంది. ఈ ఫ్రెస్కో పరిరక్షణ, అధ్యయనం కొనసాగుతుంది. ఇది ప్రారంభ క్రైస్తవ చరిత్రకు కీలకమైన ఆధారం అవుతుందన్నారు.
