Site icon NTV Telugu

AR Rahman Controversy: ఆఫర్లకు మతానికి సంబంధం ఏంటి?.. ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం!

Ar Rahman

Ar Rahman

AR Rahman Controversy: ఇటీవల ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చకు కారణమయ్యాయి. గత ఎనిమిదేళ్లుగా తనకు అవకాశాలు తగ్గాయని, దానికి కారణం కేవలం పని విషయంలో మార్పులే కాదు, నిర్ణయాలు తీసుకునే వాళ్ల ఆలోచనలు మారిపోవడమని చెప్పారు. ఈ మాటల్లో “కమ్యూనల్” అనే కోణం ఉండొచ్చని అనడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్‌ను ఒక ప్రశ్న అడిగారు. “బాలీవుడ్‌లో తమిళ వర్గం పట్ల వివక్ష ఉందని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.. 1990లలో మీ అనుభవం ఎలా ఉంది” అనే ప్రశ్నకు రెహమాన్ నవ్వుతూ స్పందించారు. అప్పట్లో తనకు అలాంటి విషయాలేవీ తెలియలేదని, బహుశా దేవుడే వాటిని తన నుంచి దాచేశాడేమోనని అన్నారు. అనంతరం.. ఒక కీలక విషయం చెప్పారు. గత ఎనిమిదేళ్లుగా పరిస్థితులు మారాయని, ఇప్పుడు సృజనాత్మకత లేని వాళ్ల చేతుల్లో అధికారముందని చెప్పారు. ఇది నేరుగా తాను ఫేస్ చేయలేదని.. ఇవి ఇతరుల ద్వారా తన చెవిన పడిన మాటలన్నారు.

READ MORE: Kriti – Keerthy Suresh : కృతి శెట్టికి షాక్ ఇచ్చిన కీర్తి సురేష్.. చేతికి వచ్చిన బాలీవుడ్ ఆఫర్ మాయం!

కొన్ని సినిమాల్లో తనను ఎంపిక చేశామని చెప్పి, చివరకు మ్యూజిక్ కంపెనీలు మరికొంతమంది కంపోజర్లను పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని రెహమాన్ చెప్పారు. అలా జరిగినా తనకు బాధగా అనిపించలేదన్నారు. “నాకు విశ్రాంతి దొరికింది, కుటుంబంతో టైమ్ గడపొచ్చు” అనుకుని ఊరుకున్నానని చాలా సింపుల్‌గా చెప్పారు. అయితే ఈ మాటలను కొందరు కమ్యూనల్ కోణంలో అర్థం చేసుకోవడంతో వివాదం మొదలైంది. ఇదే ఇంటర్వ్యూలో ‘ఛావా’ సినిమా గురించి కూడా రెహమాన్ మాట్లాడారు. ఆ సినిమా సంగీతంపై తాను గర్వపడుతున్నానని చెప్పారు. అయితే సినిమా కొంత విభజన భావాన్ని ఉపయోగించుకుందన్నారు. అదే సమయంలో ధైర్యం, వీరత్వాన్ని చూపించడమే సినిమా అసలు ఉద్దేశమని అభిప్రాయపడ్డారు.

READ MORE: IND vs BAN U19: మల్హోత్రా మ్యాజిక్‌.. డీఎల్‌ఎస్‌ పద్ధతిలో బంగ్లాపై భారత్ విజయం..!

రెహమాన్ కెరీర్‌ను చూస్తే ఆయన ప్రతిభపై ఎవరికీ సందేహం అవసరం లేదు. ఎన్నో జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ‘కాట్రు వెలియిడై’, ‘మామ్’, ‘పొన్నియిన్ సెల్వన్ 1’ లాంటి సినిమాలకు అవార్డులు కూడా వచ్చాయి. అలాంటి వ్యక్తి నోటి నుంచి కమ్యూనల్ వివక్ష అన్న మాటలు రావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ వివాదంపై రచయిత జావేద్ అఖ్తర్ స్పందిస్తూ.. ఈ అంశాన్ని పెద్దదిగా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ముంబైలో రెహమాన్‌కు చాలా గౌరవం ఉందని, ఆయన పశ్చిమ దేశాల ప్రాజెక్టులు, పెద్ద షోలు వల్ల బిజీగా ఉంటారని భావించి చిన్న నిర్మాతలు దగ్గరికి రావడానికి భయపడుతుంటారేమోనని అభిప్రాయపడ్డారు. ఇందులో కమ్యూనల్ కోణం లేదని తనకు అనిపిస్తోందని స్పష్టం చేశారు.

READ MORE: IND vs BAN U19: మల్హోత్రా మ్యాజిక్‌.. డీఎల్‌ఎస్‌ పద్ధతిలో బంగ్లాపై భారత్ విజయం..!

గాయకుడు షాన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను కూడా ఎన్నో పాటలు పాడినా, కొన్నిసార్లు ఆఫర్లు రాని సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోనని, ప్రతి ఒక్కరికీ వారి అభిరుచులు ఉంటాయని అన్నారు. రెహమాన్‌కు ప్రత్యేకమైన స్టైల్ ఉందని, అభిమానులు తగ్గలేదు, మరింత పెరుగుతున్నారని చెప్పారు. సంగీతంలో కమ్యూనల్ లేదా మైనారిటీ అనే కోణం ఉండదని, సంగీతం అలా పని చేయదని షాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి, రెహమాన్ మాటలు ఒక పెద్ద చర్చకు దారి తీశాయి. కొందరు వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారు.. మరికొందరు నిజాయితీగా తన అనుభవం చెప్పాడని భావిస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. కాలం మారుతోంది.. పరిశ్రమ మారుతోంది. కొత్త తరం ముందుకు వస్తుంది. ఆఫర్లు ఎల్లకాలం ఉండవనేది జగమెరిగిన సత్యం!

Exit mobile version