Site icon NTV Telugu

Dharmendra Pradhan: 10, 12వ తరగతుల పరీక్షలు ఏడాదికి రెండుసార్లు.. కానీ..!

Dharmendra Pradhan

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ఏటా రెండుసార్లు నిర్వహించతలపెట్టిన పది, 12వ తరగతి బోర్డు పరీక్షలకు రెండింటికీ హాజరుకావడం తప్పనిసరి కాదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు బోర్డు పరీక్షలకు ఒక్కసారి హాజరయ్యే అవకాశం ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒత్తిడిని తగ్గించేందుకే కొత్త విధానాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. పది, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో హాజరయ్యేందుకు విద్యార్థులకు ఇంజినీరింగ్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష జేఈఈ మాదిరిగా రెండుసార్లు అవకాశం ఉంటుంది. అందులో బెస్ట్ స్కోర్‌ను వాళ్లు ఎంచుకోవచ్చు. అయితే, ఇదంతా ఆప్షనలే. తప్పనిసరి కాదు. ఆశించిన స్థాయిలో రాయలేదనే భయం, అవకాశం కోల్పోయామనే ఆందోళన, ఇంకా బాగా రాయొచ్చనే ఆత్రుత.. ఇలాంటి విషయాలను ఆలోచిస్తూ విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. అందుకే కొత్తగా ఈ ఐచ్ఛిక విధానాన్ని ప్రారంభిస్తున్నామని కేంద్రం అంటోంది. ఒకవేళ తొలిదఫా పరీక్షల్లో మంచి స్కోరు వచ్చిందని భావిస్తే.. తర్వాత పరీక్షకు హాజరుకానవసరం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.

రాజస్థాన్‌లోని కోటాలోని ఐఐటీ కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్థులు వరుస ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది చాలా సున్నితమైన విషయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవడం సమష్టి బాధ్యతని చెప్పారు. ఈ క్రమంలో డమ్మీ పాఠశాలల అంశంపై చర్చ జరగాల్సి ఉందన్నారు. కోచింగ్‌ అవసరం లేదని.. కేవలం పాఠశాల విద్య సరిపోయేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం న్యూ కరిక్యూలమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ NCF విధానాన్ని కేంద్ర విద్యాశాఖ ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదించింది. దీని ప్రకారం, బోర్డు పరీక్షలు ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. ఆయా సబ్జెక్టుల్లో సాధించిన ఉత్తమ స్కోరును ఎంచుకొనే అవకాశం కలగనుంది. దాంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గడంతో పాటు వారి స్కోరును మెరుగుపరుచుకొనేందుకు అవకాశం లభిస్తుందని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. వచ్చేఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతోపాటు దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు క్యాంపస్‌ల ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించేందుకు చర్చలు జరుగుతున్నాయని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ అన్నారు. త్వరలోనే వాటిని UGC నోటిఫై చేస్తుందని ఆయన చెప్పారు.

Exit mobile version