NTV Telugu Site icon

APJ Abdul Kalam: హ్యాట్సాఫ్ కలాం.. గిఫ్ట్ కి కూడా చెక్ ఇచ్చారా?

Apj

Apj

ప్రస్తుతం రాజకీయంగా ఒక్క చిన్న పదవి ఉంటే చాలు కొన్ని కోట్లు వెనుకేసుకుంటున్నారు. అలాంటిది దేశ అత్యున్నత పౌరుడి స్థానంలో ఉండి కూడా తనకు ఇచ్చిన గిఫ్ట్ కు డబ్బులు ఇచ్చిన వ్యక్తి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ఎంతటి గొప్ప వ్యక్తో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా పేరుపొందిన ఆయన గొప్ప సైంటిస్ట్ గానే కాకుండా మానవతావాదిగా కూడా పేరు పొందారు. ఆయన చనిపోయినప్పటికీ ఇప్పటికీ ఎందరికో రోల్ మోడల్ గా నిలుస్తు్న్నారు. ఆయన చనిపోయి దాదాపు ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆయనను ప్రజలు మర్చిపోలేకపోతున్నారు.
రాష్ట్రపతిగా పనిచేసిన ఆయన ఆ పదవికే వన్నెతెచ్చారు. అవినీతి ఆరోపణలు లేని గొప్ప వ్యక్తి కలాం. అంతేకాదు ఎటువంటి రాజకీయ చరిత్ర లేకుండానే కలాం దేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఇక ఆ సమయంలో ఆయన ఎంత నిబద్దతో ఉన్నారో తెలియజెప్పే ఒక విషయాన్ని ఐఏఎస్ ఆఫీసర్ ఎంవీ రావు ఎక్స్( ట్విటర్) ద్వారా పంచుకున్నారు. ఇక దానిలో కలాం ఎటువంటి గిఫ్ట్ లు తీసుకునే వ్యక్తి కాదని, ఎవరైనా ఆయనకు ఏదైనా కానుకలిచ్చిన దానికి ఆయన డబ్బులు ఇచ్చేవారని దానికి సాక్ష్యంగా ఉన్న ఒక చెక్ ను ఆయన పంచుకున్నారు.

Also Read: Plane Crash : ఓరీ దేవుడా… రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వైరల్ అవుతున్న వీడియో

ఇక దాని గురించి ఎంవీ రావు ఇలా రాసుకొచ్చారు. ‘ఎంతటి గొప్ప వ్యక్తి, విలువలతో జీవితాంతం జీవించారు. 2014లో అబ్దుల్ కలాం ముఖ్య అతిధిగా హాజరయిన ఒక కార్యక్రమానికి సౌభాగ్య వెట్ గ్రైండర్ కంపెనీ స్పాన్సర్ గా వ్యవహరింది. ఆ సమయంలో కలాంకు కంపెనీ ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకోగా ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. అది కేవలం గ్రైండర్ మాత్రమేనని దానిని తీసుకోవాలని వారు అభ్యర్థించారు. దాంతో ఆయన ఏం వారించకుండా దానిని తీసుకున్నారు. తరువాతి రోజు కలాం మార్కెట్ లో ఆ గ్రైండర్ ధర ఎంత ఉందో కనుక్కోవడానికి ఒక వ్యక్తిని పంపారు. తరువాత స్వయంగా తన అకౌంట్ నుంచి ఆ గ్రైండర్ రేటును చెక్కుపై రాసి కంపెనీకి పంపించారు. అనుకున్నట్లుగానే కలాం గారు చెక్ పంపిచడంతో కంపెనీ దానిని డిపాజిట్ చేయలేదు.

అయితే ఇక్కడితే కథ అయిపోలేదు. తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయో లేదో కలాం తన బ్యాంక్ ద్వారా తెలుసుకొని ఆ గ్రైండర్ కంపెనీకి కాల్ చేసి మీరు చెక్ బ్యాంక్ లో డిపాజిట్ చేయండి లేదంటే నేను మీ గ్రైండర్ వెనక్కి పంపిచేస్తాను అని చెప్పారు. దీంతో చేసేది లేక ఆ కంపెనీ చెక్ ను బ్యాంక్ లో డిపాజిట్ చేసింది. అయితే అలా చేసే ముందు ఆ చెక్ ను ఫోటో తీసుకుంది ఆ కంపెనీ. ఇదే ఆ చెక్’ అని రాసుకొచ్చారు. ఇక ఆ గ్రైండర్ ధర రూ. 4850 ఉన్నట్లుగా చెక్ ను చూస్తే అర్థం అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు కలాం ఎంత గొప్పవ్యక్తో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమేనని, ఆయన మహోన్నతమైన మనిషి అని కొనియాడుతున్నారు. ఎంతమందికో నేటికీ ఆయన స్ఫూర్తిదాత అని ప్రశంసిస్తున్నారు.

 

 

 

Show comments