Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!

Rains Today

Rains Today

Three Days of Rain in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడింది. ప్రస్తుతం అల్పపీడనం మయన్మార్‌, బంగ్లాదేశ్‌ వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, త్రిపురలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్‌ 1 నుంచి 3వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వర్షాలతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రజలు, ముఖ్యంగా తీర ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమూ ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.