ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు, నిల్వలు, సరఫరాపై విజిలెన్స్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా పర్యవేక్షణలో అక్టోబర్ 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందేలా చూడటమే లక్ష్యంగా సివిల్ సప్లైస్, జీఎస్టీ, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ , పోలీస్ శాఖల సమన్వయంతో ఈ దాడులు జరుగుతున్నాయి.
ఇప్పటివరకు మొత్తం 294 తనిఖీ బృందాలు రంగంలోకి దిగి 248 మార్కెట్లు, వివిధ ప్రాంతాలను పరిశీలించాయి. ఇందులో భాగంగా 714 హోల్‌సేల్ వ్యాపార సంస్థలు, 17 రైస్ మిల్లులు, 13 గోదాములు, 144 రిటైల్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై ఇప్పటివరకు 516 కేసులు నమోదు చేశారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు ధరల అసాధారణ పెరుగుదలకు సంబంధించి ఒకటి, కృత్రిమ కొరత సృష్టించినందుకు ఒకటి, అక్రమ నిల్వలు , మళ్లింపులకు సంబంధించి మూడు ఘటనలను గుర్తించారు.
ఈ దాడులలో భాగంగా అధికారులు రూ.10,43,10,528 విలువైన అక్రమ సరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 159.204 టన్నుల బియ్యం, 2,017.755 మెట్రిక్ టన్నుల బియ్యం ధాన్యం, 831.45 కిలోల పప్పులు, 1,930 లీటర్ల వంట నూనె, 9.3 మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు, అక్రమ రవాణాకు సంబంధించిన మరో 1,050 కిలోల సరుకులు ఉన్నాయి. నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టించినా సహించేది లేదని, అలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ (PD Act) కింద కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా తీవ్రంగా హెచ్చరించారు.

